
సాక్షి, హైదరాబాద్: వరద సాయంపై ప్రతిపక్ష నేతలు బురద రాజకీయం చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లక్షల 30 వేల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని నాలాలపై అక్రమ నిర్మాణాలున్నాయని, భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందని వెల్లడించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో రాబోయే విపత్తును ఎదుర్కొన్నామని, ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. వరద సహాయక చర్యలపై ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక సీఎం లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే స్పందించారని గుర్తు చేశారు. గుజరాత్ కూడా వరద సహాయం ప్రకటించారని తెలిపారు. ‘8,800 కోట్లు నష్టం జరిగిందని బీజేపీవాళ్లు చెప్పారు. మన నగరం మన బీజేపీ అంటున్నారు. ఎక్కడుంది వరద సాయం ఇవ్వని బీజేపీ మన నగరంలో ఎక్కడుంది. ఒక్క పైసా ఇవ్వలేని అసమర్ధులు.. మీరా మమ్మల్ని విమర్శించేది?’ అని బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయత మంత్రా చెప్పాలని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment