సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రకటించిన నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని పొందాలనుకునే అపార్ట్‌మెంట్లలోని ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను జలమండలి వెబ్‌సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించి పూర్తిచేసుకోవాలి. సాధారణంగా ప్రతి అపార్ట్‌మెంట్‌కూ ఒకే నల్లా కనెక్షన్ (బల్క్) ఉంటుంది. కానీ ఫ్లాట్స్ మాత్రం 10 నుంచి 100 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్లాట్ వినియోగదారుని ఆధార్‌ను కూడా నల్లా కనెక్షన్ నంబరుకు అనుసంధానించాల్సి ఉంటుందని జలమండలి స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.
అట్లయితే అనర్హులే..
నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకున్న ప్రతీ వినియోగదారుడు ఈ నెల 31లోగా తమ నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిన విషయం విదితమే. మురికివాడలు మినహా ఇతర గృహ వినియోగదారులు సైతం నల్లా కనెక్షన్ నంబరుకు ఆధార్‌ను మీ సేవ కేంద్రాల్లో అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ప్రతి గృహ వినియోగదారుడూ తమ నల్లాకున్న మీటర్ పని చేస్తుందో లేదో తనిఖీ చేసుకోవాలి. లేని పక్షంలో కొత్త మీటరును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటరు పని చేయని పక్షంలో ఉచిత నీటి పథకానికి అనర్హులని జలమండలి ప్రకటించింది.
ఆధార్ అనుసంధానం ఇలా..
అపార్ట్‌మెంట్ వాసులు ముందుగా జలమండలి వెబ్‌సైట్.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హైదరాబాద్ వాటర్.జీఓవీ.ఐఎన్’ను సంప్రదించాలి. ఇందులో ఆధార్ అనుసంధానం అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ముందుగా తమ అపార్ట్‌మెంట్‌కున్న నల్లా కనెక్షన్ (క్యాన్)కు అనుసంధానమైన మొబైల్ నంబరుకు ఓటీపీ వెళుతుంది.ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఎక్స్‌ఎల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫ్లాట్ యజమాని పేరు, ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటికేషన్ (పీటీఐఎన్)నంబరు, ఆధార్‌ను నమోదు చేయాలి.ఆధార్ నంబరుకు లింక్ చేసిన మొబైల్ నంబరుకు మరో ఓటీపీ మెసేజ్‌వెళుతుంది. దీన్ని ఎంటర్ చేస్తేనే ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుంది. ప్రతి ఫ్లాట్ వినియోగదారుడూ విధిగా ఈ ప్రక్రియను వేర్వేరుగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
సుమారు 50 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు అందరూ ఒకేసారి కాకుండా రోజుకు పది మంది చొప్పున ఈ ప్రక్రియను చేపడితేనే అనుసంధానం సులువవుతుంది. ఈ సమస్యలో ఇబ్బందులుంటే జలమండలి క్షేత్రస్థాయి కార్యాలయాలు లేదా 155313 కాల్‌సెంటర్ నంబరులో సంప్రదించాలని జలమండలి అధికారులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment