Kaithalapur Flyover: నిత్యం రణగొణధ్వనులతో పారిశ్రామిక ప్రాంతం అట్టుడికేది. అదేస్థాయిలో అరగంటలోనే ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీతో నిండి వాహనాల ధ్వనులతో రెండు దశాబ్ధాలుగా కూకట్‌పల్లి ప్రజలు పడ్డ వేదన ఇంతా అంతా కాదు. ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తామని గతంలో అందరూ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. కానీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధినే ఎజెండాగా మార్చుకోవడంతో పాటు ట్రాఫిక్ ఫ్రీ కూకట్‌పల్లిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన సర్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అధిష్టానంతో ఎదురొడ్డి పోరాడి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిలబడటం విశేషం.
బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు..
► గత ఏడేళ్లలో సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టగా అంతకు మించి నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
► ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఆయన తొక్కని గడప లేదు. అన్ని శాఖల అధికారులు, మంత్రులను కలిసి తన విన్నపాన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వం బాలానగర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి అదే పనిగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు రాత్రింబవళ్లు అక్కడే ఉండి బాలానగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
► బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని బోయిన్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఫతేనగర్, కూకట్‌పల్లి, మూసాపేట, చందానగర్, మియాపూర్, బొల్లారం ప్రాంతాల్లో నివాసం ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది.
► అదే విధంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నిజాంపేట, ప్రగతినగర్‌ల నుంచి జేఎన్‌టీయూ మీదుగా విధులకు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంతో ఎంతో మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు.
► ఇదిలా ఉండగా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి గంటల పాటు ట్రాఫిక్ నిలిచి సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన మాదాపూర్‌కు ప్రధాన రహదారి అయిన హైటెక్ సిటీ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం విశేషం.
► ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అందాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఊరట కలిగించింది.
నాలుగో బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు..
► బాలానగర్, మూసాపేట ప్రాంతాలకు కొంగుబంగారంగా నిలిచే నాలుగో బ్రిడ్జి నిర్మాణ కై త్లాపూర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది.
► ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని తలపించే మూసాపేట కైత్లాపూర్ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు వేసినట్లైంది.
► గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను హైటెక్ సిటీ కి నేరుగా వెళ్లే రహదారి ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి.
► కూకట్‌పల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే కృష్ణారావు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసి తన హయాంలోనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం విశేషం.
► కైత్లాపూర్ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్‌పల్లి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment