Madhavaram Krishna rao
-
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు
-
మూడవసారి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైన మాధవరం కృష్ణారావు
-
కూకట్పల్లి ప్రజలు ఈసారి ఎన్నుకోబోతున్న అభ్యర్థి ఎవరు?
కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్పల్లి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు దివంగత టిడిపి నేత నందమూరి హరికృష్ణ కుమార్తె, టిడిపి అభ్యర్ధి నందమూరి సుహాసినిపై ఘన విజయం సాదించారు. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టిని ఈ నియోజకవర్గం ఆకర్షించింది. కాంగ్రెస్ఐ, టిడిపి, తెలంగాణ జనసమితి, సిపిఐల మహా కూటమిలో భాగంగా టిడిపి ఈ సీటు తీసుకుంది. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఫలితం దక్కలేదు. చంద్రబాబు, కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీలు కలిసి కూకట్‌పల్లితో సహా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో ప్రచారం చేశారు. అయినా ఓటమి తప్పలేదు. మాదవరం కృష్ణారావు 41049 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. 2014 లో కృష్ణారావు టిడిపి టిక్కెట్‌పై గెలిచి, తదుపరి ఆయన టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి గెలిచారు. కృష్ణారావుకు 111612 ఓట్లు రాగా, సుహాసినికి 70563 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి టిక్కెట్ పై పోటీచేసిన హరిశ్చంద్రారెడ్డికి 12 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. 2014లో మాధవరం కృష్ణారావు 43186 ఓట్ల ఆదిక్యతతో టిఆర్ఎస్ అభ్యర్ధి గొట్టుముక్కల పద్మారావుపై విజయం సాదించారు. 2009లో కూకట్‌పల్లికి ప్రాతినిద్యం వహించిన లోక్‌సత్తా అదినేత జయప్రకాష్ నారాయణ 2014లో ఇక్కడ పోటీచేయలేదు. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గానికి పోటీచేసి ఓడిపోయారు. రెండువేల తొమ్మిదిలో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఒకసారి కమ్మ సామాజికవర్గం నేత, రెండుసార్లు వెలమ సామాజికవర్గం నేత గెలిచారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కూకట్పల్లి: ఆగస్టు 1 నుంచి పాదయాత్ర
హైదరాబాద్: కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ► ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 95శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కలి్పస్తున్నామన్నారు. భూగర్భ పైపులైన్ల ద్వారా వదర నీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ► ఒకప్పుడు చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచేదన్నారు. ఈ తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కారణంగా ముంపు తీవ్రత చాలా వరకు తగ్గిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలను కూడా తట్టుకోగలిగామని పేర్కొన్నారు. ► ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పే బాధ్యత మనపై ఉందన్నారు. సంక్షేమ పథకాల విషంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకుంటానన్నారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ పాదయాత్రలో తన దృష్టికి తీసుకురావాలని కోరారు. -
ఇక కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ.. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు
Kaithalapur Flyover: నిత్యం రణగొణధ్వనులతో పారిశ్రామిక ప్రాంతం అట్టుడికేది. అదేస్థాయిలో అరగంటలోనే ఆరు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ రద్దీతో నిండి వాహనాల ధ్వనులతో రెండు దశాబ్ధాలుగా కూకట్పల్లి ప్రజలు పడ్డ వేదన ఇంతా అంతా కాదు. ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తామని గతంలో అందరూ ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆచరణలో పెట్టకపోవడం గమనార్హం. కానీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభివృద్ధినే ఎజెండాగా మార్చుకోవడంతో పాటు ట్రాఫిక్ ఫ్రీ కూకట్‌పల్లిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఆయన సర్వ ప్రయత్నాలు చేశారు. ఆఖరికి అధిష్టానంతో ఎదురొడ్డి పోరాడి ప్రజల సమస్యలను తీర్చేందుకు నిలబడటం విశేషం. బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే తొక్కని గడప లేదు.. ► గత ఏడేళ్లలో సుమారు 1000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టగా అంతకు మించి నాలుగు ఫ్లై ఓవర్ల నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ► ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం ఆయన తొక్కని గడప లేదు. అన్ని శాఖల అధికారులు, మంత్రులను కలిసి తన విన్నపాన్ని తెలిపారు. దీంతో ప్రభుత్వం బాలానగర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి అదే పనిగా నిర్మాణం పూర్తయ్యేంత వరకు రాత్రింబవళ్లు అక్కడే ఉండి బాలానగర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ► బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఫతేనగర్, కూకట్పల్లి, మూసాపేట, చందానగర్, మియాపూర్, బొల్లారం ప్రాంతాల్లో నివాసం ఉండే లక్షలాది మంది ప్రజలకు ఉపశమనం కలిగింది. ► అదే విధంగా ప్రతి రోజూ లక్షల సంఖ్యలో నిజాంపేట, ప్రగతినగర్ల నుంచి జేఎన్టీయూ మీదుగా విధులకు వెళ్లే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం హైటెక్ సిటీ స్పైనల్ రోడ్డులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంతో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ► ఇదిలా ఉండగా కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడిగా మారి గంటల పాటు ట్రాఫిక్ నిలిచి సిలికాన్ వ్యాలీ సిటీగా పేరొందిన మాదాపూర్‌కు ప్రధాన రహదారి అయిన హైటెక్ సిటీ బ్రిడ్జి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం విశేషం. ► ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆ ప్రాంతం ఎంతో అందాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఊరట కలిగించింది. నాలుగో బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు.. ► బాలానగర్, మూసాపేట ప్రాంతాలకు కొంగుబంగారంగా నిలిచే నాలుగో బ్రిడ్జి నిర్మాణ కై త్లాపూర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ► ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాన్ని తలపించే మూసాపేట కైత్లాపూర్ ప్రాంతంలో ఈ బ్రిడ్జి నిర్మాణంతో బంగారు బాటలు వేసినట్లైంది. ► గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలను హైటెక్ సిటీ కి నేరుగా వెళ్లే రహదారి ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వచ్చాయి. ► కూకట్‌పల్లిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎమ్మెల్యే కృష్ణారావు అంశాల వారీగా సమస్యలను పరిశీలించి వాటిపై అధ్యయనం చేసి తన హయాంలోనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడం విశేషం. ► కైత్లాపూర్ బ్రిడ్జి నిర్మాణంతో కూకట్పల్లి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దుకోనుంది. -
ఆలోచించి ఓటు వేయండి
కేపీహెచ్‌బీకాలనీ: కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలు ఆలోచించి వేయాలని ఓటు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్న కూకట్‌పల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన బుధవారం ఆయన నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ర్యాలీలు, పాదయాత్రల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కూకట్పల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకు దక్కుతుందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా తాను కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నానన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో కూకట్పల్లి నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గం, సమస్యలపైనా ఎలాంటి అవగాహన, అనుభవం లేనివారికి ఓటువేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు.... కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, ఎన్నికల పేరుతో ప్రత్యర్థి పార్టీల నాయకులు ప్రజల మధ్య చిచ్చుపెట్టడం భావ్యం కాదన్నారు. కులం, ప్రాంతం పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా గెలుపొందాలనే తపనతో రాహుల్‌గాంధీ మొదలు చంద్రబాబునాయుడు, బాలక్రిష్ణ తదితరులు కూకట్‌పల్లిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తస్థాయి నుంచి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎదిగిన తనను అడ్డుకునేందుకు జాతీయస్థాయి నేతలు, ముఖ్యమంత్రులు రంగంలోకి దిగడంతో ప్రజలు ఎవరివైపు ఉన్నారో అర్థమవుతుదన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నా కేపీహెచ్బీలో టీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుని అద్ధాలు పగులగొట్టారని, బాలక్రిష్ణ రోడ్‌షో నేపథ్యంలో తాము ఎలాంటి నిరసనలు, ఫిర్యాదులు చేయకుండా వదిలేశామన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. అభివృద్ధిని చూసి ఆదరించండి.. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి తనను ఆదరించాలని క్రిష్ణారావు కోరారు. బాలానగర్‌లో రోడ్డు విస్తరణ, రూ.400 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం, జేఎన్టీయూహెచ్ రోడ్డులో రూ.113 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం, రూ.70 కోట్లతో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ వద్ద రైల్వే అండర్‌పాస్‌ల నిర్మాణం, ఖైత్లాపూర్ నుంచి అయ్యప్పసొసైటీకి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తదితర ప్రధాన పనులతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించామన్నారు. కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ, తాగునీరు, సీసీరోడ్లు, వీడీసీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు 9 రిజర్వాయర్లను నిర్మించామని, 178కిలో మీటర్ల మేర నూతన ఫైప్లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజు విడిచి రోజు నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, షటిల్‌కోర్టులు, ఇండోర్‌స్టేడియాలు, పార్కులు, ఆటస్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నానని. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పార్కు నిర్మాణం, నాన్‌వెజ్ మార్కెట్, రైతుబజార్ల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. -
మాధవరం కృష్ణారావుతో లీడర్
-
కూకట్‌పల్లిలో అసమ్మతి కలకలం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రకటించిన కూకట్పల్లి అభ్యర్థిని మార్చి ఆ స్థానంలో ఉద్యమకారులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఓ హోటల్లో నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఇన్చార్జి తేళ్ల నర్సింగరావు పటేల్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకుముందు హోటల్ ముందు కూకట్పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయ్యారని, కానీ నేడు వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో కడుపు మాడ్చుకుని, రోడ్ల మీద్ద కూర్చున్నామని, అరెస్టులతో జైలుపాలయ్యమన్నారు. రెండో సారి ఎన్నికల్లో ఉద్యమకారులకు కాకుండా ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వ్యక్తులకు టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు, పదవులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్పల్లి అభ్యర్థిని మార్చకుంటే కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాధవరానికే బీఫాం ఇస్తే డిపాజిట్లు రాకుండా చూస్తామన్నారు. స్వతంత్య్ర అభ్యర్థిగా ఉద్యమకారులు నిలబడితే గెలుపుకు కృషి చేయడమే కాకుండా రూ. 5లక్షలు ఇస్తానని టీఆర్ఎస్ నేత విజయ్‌కుమార్ ప్రకటించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సునీల్‌రెడ్డి, దాసు, సతీష్, రాముగౌడ్, భిక్షపతి, దేవరాజ్, సత్యనారాయణ, మధుగౌడ్, నాగరాజు, శివరాజ్‌యాదవ్, దేవదానం, సుధా రవి, కవిత తదితరులు పాల్గొన్నారు. కూకట్పల్లి టీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకమైన నాయకులు -
మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
కొత్త రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు. కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌కాలనీలో సిమ్సన్ లైఫ్ సెన్సైస్ డెవలప్, రీసెర్చ్ సెంటర్‌ను ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యానిచ్చే మందులను రీసెర్చ్‌లో కనుగొన్నాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కావాలని, పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిసిఏ అసిస్టెంట్ డెరైక్టర్ యోగానందం, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమీషనర్ సురేంద్రమోహన్, కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్ జూపల్లిసత్యనారాయణ, సంస్థ ఎండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'కూకట్ పల్లి ఎమ్మెల్యేపైనా వేటు వేయండి'
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని తెలంగాణ టీడీపీ నాయకులు కోరారు. శుక్రవారం టి.టీడీపీ నాయకులను స్పీకర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. గతంలో చాలాసార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ కోరినట్టు చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈనెల 30లోపు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో స్పీకర్ ను కలిసినట్టు వెల్లడించారు. ప్రోటోకాల్ విషయంలో అధికార పార్టీ నేతలు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని స్పీకర్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రత్యేక దేశంగా భావిస్తున్నారని, రాజీనామా వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. -
మాధవరం ఇంటిని ముట్టడించిన 'కార్యకర్తలు'
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందులోభాగంగా కూకట్‌పల్లిలోని ఆయన నివాసాన్ని ఆదివారం టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో మాధవరం ఇంటిని టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ముట్టడించారు. దాంతో పోలీసులు భారీగా సంఖ్యలో అక్కడికి చేరుకుని... కార్యకర్తలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మాధవరం కృష్ణారావు టీడీపీ టికెట్ పై గెలుపొందారు. అయితే శనివారం ఆయన టీడీపీకి రాజీనామా చేసి ... టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణలో శాసనమండలికి సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న విషయం విదితమే. -
టీఆర్ఎస్కు కలిసొచ్చిన అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే సంఖ్య కలసి వచ్చింది. కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ త లుపు తట్టడంతో టీఆర్ఎస్ చేతిలో 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లయింది. టీడీపీ నుంచి టీఆర్ఎస్కు వలస వచ్చిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఫలితంగా టీడీపీ బలం పది ఎమ్మెల్యేలకు తగ్గిపోయింది. మరికొందరు కూడా..: గ్రేటర్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టిన టీఆర్ఎస్ నాయకత్వం ఆపరేషన్ ఆకర్ష్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు... మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం మాధవరం బాటలోనే ఉన్నారని తెలిసింది. గత నెలలోనే ఇబ్రహీంపట్నం టీడీపీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఆయన అధికారికంగా చేరాలి. ఇక నగరానికే చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం గులాబీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. రేపో మాపో ఆయనా చేరడం ఖాయమంటున్నారు. టీడీపీ నుంచి క్రాస్ ఓటింగ్ చేయించే వ్యూహంలో భాగంగా.. ఆత్మప్రబోధంతో ఓటేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ఎమ్మెల్యే చేరిపోవడం, మరో ఇద్దరు చేరికకు సిద్ధంగా ఉండటం తమకు ఓటింగ్‌లో కలిసొచ్చే అంశమని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇక చేరికలతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లేసేలా మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలతో మంతనాలు చేసినట్లు పేర్కొంటున్నాయి. -
గులాబీ గూటికి మాధవరం
మహానాడు మరునాడే టీడీపీకి షాక్ ఉదయం బాబుతో జరిగిన సమావేశాలకు డుమ్మా మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిక సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ మరోసారి చిత్తయింది. ముందు నుంచి ఊహించినట్లుగానే కూకట్పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ గూటికి చేరారు. టీడీపీ వార్షిక సమావేశం మహానాడు ముగిసిన మరునాడే ఈ షాక్ తగిలింది. శనివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌజ్‌లో కృష్ణారావుకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కొంతకాలంగా దూరంగానే.. మాధవరపు కృష్ణారావు టీఆర్ఎస్లో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను సముదాయిస్తూ పార్టీ మారకుండా కాపాడుతూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే మాధవరం పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు కూడా వెళ్లలేదు. అయితే మహానాడులో మాధవరం పాల్గొనడం, పార్టీని వీడనని చంద్రబాబు, లోకేశ్‌లకు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆశతో ఉంది. కానీ వారికి షాకిస్తూ శనివారం ఆయన టీఆర్ఎస్లో చేరారు. క్యాంపు పెట్టిన టీడీపీ.. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన సమావేశంలోనే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడుతున్నట్లు కేసీఆర్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు రావడంతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయాన్నే పార్టీ ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు తన నివాసానికి ఆహ్వానించారు. కానీ కృష్ణారావు వెళ్లలేదు. బాబు తనయుడు లోకేశ్ స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అప్పటికే మానసికంగా సిద్ధమైన చంద్రబాబు... లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కలను, ఓటేసే పద్ధతిని వివరించారు. టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఈ సందర్భంగా ఎండగట్టారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు కూడా ఓటేసేందుకు ముందుకు వస్తున్న విషయాన్ని వివరించినట్లు సమాచారం. టీఆర్ఎస్ అసంతృప్తులను ఆకర్షించినా, వారి ఓట్లు చెల్లకుండా చేసినా టీడీపీ విజయం తథ్యమని వివరించినట్లు సమాచారం. చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన సూచన మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు క్యాంప్‌కు వెళ్లి ఓ రహస్య ప్రాంతంలో సమావేశమై ‘లెక్కలు’ సరి చూసుకున్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబుతో జరిగిన సమావేశాలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరుకాలేదు. ఈనెల 28న బెంగళూరు వెళుతున్నట్లు బాబుతో చెప్పిన కృష్ణయ్య.. ఇప్పటివరకు హైదరాబాద్‌కు రాలేదు, ఫోన్లో కూడా అందుబాటులో లేరు. ఇక ఈ క్యాంప్‌కు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించగా... వారు తిరస్కరించినట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న వ్యక్తిగత కారణాలతో క్యాంప్‌నకు వెళ్లలేదు. మరోవైపు టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆదివారం గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి: మాధవరం జగదేవ్‌పూర్: తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం టీఆర్ఎస్లో చేరిన ఆయన.. అనంతరం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద మాట్లాడారు. తన కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. చంద్రబాబు ఏపీలో అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడ బంగారు తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీకి ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపినట్లు తెలిపారు. -
నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...
హైదరాబాద్: 'నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు, 26 బీసీ కులాలకు న్యాయం జరగాలని' కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే అధికార టీఆర్ఎస్లో చేరడానికి తాను సిద్దమని కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం తనను కలవాలని మాధవరం కృష్ణారావుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు కృష్ణారావు ఆయన నివాసానికి వచ్చారు. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని... దాంతో శుక్రవారం ఉదయం కలవాలని కృష్ణారావుకు బాబు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న విలేకర్లు .... మీరు సైకిల్ దిగి... కారు ఎక్కుతున్నారటగా అని ప్రశ్నించారు. దాంతో కృష్ణారావుపై విధంగా స్పందించారు. -
కాసేపట్లో బాబుతో ఎమ్మెల్యే మధవరం భేటి
-
ఇద్దరమే ఉన్నా ప్రజాసమస్యలపై నిలదీస్తాం
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ... ప్రజాసమస్యలపై గళమెత్తి పోరాడుతున్న ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందని విమర్శించారు. తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినంత మాత్రాన తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. సభలో ఇద్దరు ఎమ్మెల్యేలమే ఉన్నామని...అయినా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తనకు, ఆర్ కృష్ణయ్యకు బడ్జెట్‌పై మాట్లాడే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్‌కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్‌పై ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. సభ సజావుగా సాగనీయడం లేదని గురువారం 10 మంది టీటీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ వారం పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సహచరులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.