
గులాబీ గూటికి మాధవరం
మహానాడు మరునాడే టీడీపీకి షాక్
ఉదయం బాబుతో జరిగిన సమావేశాలకు డుమ్మా
మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ మరోసారి చిత్తయింది. ముందు నుంచి ఊహించినట్లుగానే కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ గూటికి చేరారు. టీడీపీ వార్షిక సమావేశం మహానాడు ముగిసిన మరునాడే ఈ షాక్ తగిలింది. శనివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఫాంహౌజ్‌లో కృష్ణారావుకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
కొంతకాలంగా దూరంగానే..
మాధవరపు కృష్ణారావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనను సముదాయిస్తూ పార్టీ మారకుండా కాపాడుతూ వచ్చారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే మాధవరం పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ పత్రాలపై సంతకం చేసేందుకు కూడా వెళ్లలేదు. అయితే మహానాడులో మాధవరం పాల్గొనడం, పార్టీని వీడనని చంద్రబాబు, లోకేశ్‌లకు చెప్పడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆశతో ఉంది. కానీ వారికి షాకిస్తూ శనివారం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు.
క్యాంపు పెట్టిన టీడీపీ..
తెలంగాణ భవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలోనే మాధవరం కృష్ణారావు టీడీపీని వీడుతున్నట్లు కేసీఆర్ స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఈ మేరకు పత్రికల్లో వార్తలు రావడంతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. శనివారం ఉదయాన్నే పార్టీ ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు తన నివాసానికి ఆహ్వానించారు. కానీ కృష్ణారావు వెళ్లలేదు. బాబు తనయుడు లోకేశ్ స్వయంగా ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అప్పటికే మానసికంగా సిద్ధమైన చంద్రబాబు... లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో మధ్యాహ్నం టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కలను, ఓటేసే పద్ధతిని వివరించారు. టీఆర్‌ఎస్ ఐదో అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ఈ సందర్భంగా ఎండగట్టారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నుంచి ఒకరిద్దరు కూడా ఓటేసేందుకు ముందుకు వస్తున్న విషయాన్ని వివరించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అసంతృప్తులను ఆకర్షించినా, వారి ఓట్లు చెల్లకుండా చేసినా టీడీపీ విజయం తథ్యమని వివరించినట్లు సమాచారం.
చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన సూచన మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు క్యాంప్‌కు వెళ్లి ఓ రహస్య ప్రాంతంలో సమావేశమై ‘లెక్కలు’ సరి చూసుకున్నట్లు తెలుస్తోంది. కాగా చంద్రబాబుతో జరిగిన సమావేశాలకు ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరుకాలేదు. ఈనెల 28న బెంగళూరు వెళుతున్నట్లు బాబుతో చెప్పిన కృష్ణయ్య.. ఇప్పటివరకు హైదరాబాద్‌కు రాలేదు, ఫోన్‌లో కూడా అందుబాటులో లేరు. ఇక ఈ క్యాంప్‌కు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించగా... వారు తిరస్కరించినట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న వ్యక్తిగత కారణాలతో క్యాంప్‌నకు వెళ్లలేదు. మరోవైపు టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆదివారం గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లోకి: మాధవరం
జగదేవ్‌పూర్: తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. అనంతరం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద మాట్లాడారు. తన కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించాలన్న లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు చెప్పారు. చంద్రబాబు ఏపీలో అభివృద్ధి చేసుకోవాలని, ఇక్కడ బంగారు తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీకి ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని పంపినట్లు తెలిపారు.