సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వరద అనుభవాలతో లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌డీపీని ఏర్పాటు చేసింది. పనులు చేపట్టడంలో జరిగిన ఆలస్యంతో ఎక్కడా పనులు పూర్తికాలేదు. దీంతో.. తాత్కాలిక ఉపశమనంగా ఎక్కడికక్కడ వాననీరు నిల్వకుండా వెంటనే తొలగించేలా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. అన్ని జోన్లలోని నాలాల వెంబడి క్షేత్రస్థాయి సర్వేలతో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ భద్రత చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఎస్‌ఎన్‌డీపీ కింద దాదాపు రూ.747 కోట్ల విలువైన 37 వరద కాల్వల పనులు చేపట్టారు. బాటిల్ నెక్స్‌గా ఉన్న నాలాలు వెడల్పు చేయడం, బాక్స్‌డ్రెయిన్ల నిర్మాణం, రీమోడలింగ్, వంటి పనులు వీటిల్లో ఉన్నాయి. పనులైతే మొదలైనప్పటికీ, ఇవి ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రాణనష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఆమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇంకా పూర్తికాని పనులు..
ఇవి కాక 2000 సంవత్సరంలో జరిగిన ఘటనల్ని దృష్టిలో ఉంచుకొని వెడల్పు తక్కువగా ఉన్న నాలాలకు పైకప్పుల ఏర్పాటు, అన్ని నాలాలకు అవసరమైన మరమ్మతులు, పైప్‌లైన్లు, డ్రెయిన్ల ఏర్పాటు వంటి పనుల కోసం రూ.298.34 కోట్లు మంజూరు చేశారు. మొత్తం 468 పనులకు రూ.139.78 కోట్లతో 98 పనులు పూర్తిచేశారు. రూ. 94.11కోట్ల విలువైన 98 పనులు కొనసాగుతున్నాయి. కోర్టు వివాదాలు తదితరమైన వాటితో రూ.5.82 కోట్ల విలువైన 19 పనులు పనులు రద్దు చేశారు. మిగతా పనులు ఆయా దశల్లో ఉన్నాయి తప్ప పూర్తి కాలేదు.
ఎమర్జెన్సీ టీమ్స్..
వర్షాకాల ఫిర్యాదులపై వెంటనే రంగంలోకి దిగి వాన నీటినిల్వలు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 160 స్టాటిక్ లేబర్ టీమ్స్ ఏర్పాటు చేశారు. స్టాటిక్‌టీమ్స్ నీరు నిలిచే ప్రాంతాలకు దగ్గరలో ఉండి వెంటనే నీటిని తోడిపోస్తాయి. అందుకు 237 పంప్‌సెట్లను సమకూర్చుకున్నారు. అక్టోబర్ వరకు పనిచేసే ఈటీమ్స్ కోసం రూ. 36.98కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇవి కాక ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు తమ మార్గాల్లో పనుల కోసం 29 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవి జీహెచ్‌ఎంసీ నుంచి కాగా, వాటర్‌బోర్డు, విద్యుత్ విభాగాల అధికారులు సైతం జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కందే ఫిర్యాదులు పరిష్కరించేలా జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌లో
040– 21 11 11 11 ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.
►ఎక్కడైనా రోడ్లపై నీరు, మురుగు నిలిచినా, విద్యుత్ సమస్యలు తలెత్తినా ఇవి వెంటనే రంగంలో దిగుతాయని మేయర్ పేర్కొన్నారు.
ప్రాణాపాయం జరగకుండా పటిష్ట చర్యలు..
►900కుపైగా ప్రాంతాలకు ఇన్‌చార్జి అధికారులు
►వర్షాల కారణంగా ఎక్కడా, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటంతోపాటు
►సమస్యాత్మక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పనులు చేపట్టేందుకు వీలుగా అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు.
►ఎల్‌బీనగర్ జోన్‌లో 74 సమస్యాత్మక ప్రాంతాలకు 76 మంది అధికారులను ఇన్‌చార్జులుగా నియమించారు. చార్మినార్ జోన్‌లో 52 సమస్యాత్మక ప్రాంతాలకు 32 మంది అధికారులను, ఖైరతబాద్‌జోన్‌లోని 711 ప్రాంతాలకు 81 మంది అధికారులను, శేరిలింగంపల్లి జోన్‌లోని 52 సమస్యాత్మక ప్రాంతాలకు 52 మంది అధికారులను, కూకట్‌పల్లి జోన్‌లోని 48 సమస్యాత్మక ప్రాంతాలకు 49 మంది అధికారులను,సికింద్రాబాద్ జోన్‌లోని 55 సమస్యాత్మ కప్రాంతాలకు 79 మంది అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించారు. వారి నేతృత్వంతో దిగువస్థాయి సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి వాన సమస్యల్ని పరిష్కరిస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment