దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్‌ ఐడియా ఎలా వచ్చిందంటే.. | Hyderabad Iconic Exhibition Numaish Its History And Why Shoppers Still Flock To It | Sakshi
Sakshi News home page

Nampally Numaish 2022: దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్‌ ఐడియా ఎలా వచ్చిందంటే..

Published Sun, Jan 2 2022 8:45 AM | Last Updated on Sun, Jan 2 2022 12:30 PM

Hyderabad Iconic Exhibition Numaish Its History And Why Shoppers Still Flock To It - Sakshi

ఎగ్జిబిషన్‌..అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఈ పేరు వింటేనే నగరవాసులకో పండగ అని చెప్పొచ్చు. ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. వేల సంఖ్యలో స్టాళ్లు..ఇతర రాష్ట్రాల వస్తువులు సైతం విక్రయం..వినోదానికి పెద్దపీట..కోట్ల రూపాయల వ్యాపారంతో సిటీ ఎగ్జిబిషన్‌కు దేశవ్యాప్తంగా పేరుంది. ఇంతటి ఎగ్జిబిషన్‌ గతేడాది కరోనా కారణంగా బంద్‌కాగా..ఈ ఏడాది శనివారం నుంచి షురూ అయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ చరిత్ర..ప్రాముఖ్యత..పరిణామ క్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

సాక్షి హైదరాబాద్‌: నగరానికి తలమానికంగా నిలిచే ఎగ్జిబిషన్‌(నుమాయిష్‌)కు సరిగ్గా 85 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పట్లో హైదరాబాద్‌ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్‌..నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా మారింది. నాడు కొంత మంది విద్యావంతుల ఆలోచన నేడు వేల మందికి ఉపాధిని సమకూరుస్తోంది. 80 స్టాల్స్‌తో దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్‌..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 50 లక్షల మంది సందర్శకులతో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా గుర్తింపు సాధించింది. 

నుమాయిష్‌కు అనుమతి... 
1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్‌ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్‌ అక్బర్‌ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు సమకూరుతాయని వారు వివరించారు.  అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌కు పంపించారు. దీంతో ఉస్మాన్‌అలీ ఖాన్‌ నుమాయిష్‌ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు

►ఆ తర్వాత..నుమాయిష్‌ ఎక్కడ..ఎలా నిర్వహించాలనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పట్టభద్రుల సంఘం వివిధ పనులకు కమిటీలు ఏర్పాటు చేసింది.
►తొలుత పరిశ్రమలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసే కర్మాగారాలు, అప్పట్లో ఉన్న పెద్ద దుకాణాల నిర్వాహకులు, యజమానులను సంప్రదించి నూమాయిష్‌ ఆవశ్యకతను వివరించారు.
► మరోవైపు జంట నగర ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వేతికారు. చివరికి బాగేఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
► చివరకు తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్‌ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్‌అలీ ఖాన్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్‌ నిర్వహించారు. 

పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి నాంపల్లికి... 
1946 వరకు పబ్లిక్‌ గార్డెన్స్‌లో నుమాయిష్‌ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. స్థాపించిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రజాదరణ పెరిగింది. నుమాయిష్‌లో స్టాల్స్‌ పెరగడంతో పబ్లిక్‌ గార్డెన్స్‌లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్‌ గార్డెన్స్‌ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. చివరికి నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. 1946లో హైదరాబాద్‌ అప్పటి ప్రధాని సర్‌ మీర్జా ఇస్మాయిల్‌ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. నేటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది. 

దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌  
ఎగ్జిబిషన్‌ ప్రత్యేకత ఎమిటేంటే..ఇక్కడ రూ.10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తుంటాయి. నగర, రాష్ట్ర, దేశ విదేశీ పరిశ్రమల్లో తయారు చేసిన దాదాపు 10 లక్షలకుపైగా వైరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఫుడ్‌ ఐటమ్స్‌తో పాటు సంస్కాృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వినోదం కోసం రకరకాల ఐటమ్స్‌ ఎగ్జిబిషన్‌లో కొలువుదీరాయి. అందుకే దీన్ని దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా గుర్తిస్తున్నారు. 

ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా.. 
1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్‌ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్‌ పేరును ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ గతేడాది వరకు విరామం లేకుండా ప్రతి ఏటా కొనసాగింది. గతేడాది కరోనాతో నుమాయిష్‌ను మూసివేసారు. ఈ ఏడాది కేవలం 1500 స్టాల్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు.   

నుమాయిష్‌ ఐడియా ఎలా వచ్చిందంటే.. 
హైదరాబాద్‌  ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశంలో తీర్మానించింది. అయితే సర్వేకు నిధుల కొరత ఏర్పడగా..ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే నిధులు వస్తాయని సభ్యులు సలహా ఇచ్చారు. మన సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే..ఇటు పరిశ్రమల ద్వారా అటు వాటిని సందర్శించడానికి వచ్చే ప్రజల నుంచి నిధులు సులువుగా వస్తాయని సభ్యులందరూ అలోచించి నుమాయిష్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement