సాక్షి, హైదరాబాద్: ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమా గుర్తుందా? అందులో ఊరి నుంచి వచ్చిన బ్రహ్మానందంను నమ్మించి చార్మినార్‌ను తనికెళ్ల భరిణి విక్రయిస్తాడు. ఈ ఘటన కూడా ఇంచుమించు అలాంటిదే. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి ప్రవేశపెట్టిన స్వీయ మదింపు (సెల్ప్ అసెస్‌మెంట్)లో ఉన్న లోపాలను, అధికారుల పర్యవేక్షణ వైఫల్యాన్ని బయటపెట్టడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ ఏకంగా మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయానికి ఆస్తి పన్ను స్వయంగా మదింపు చేసుకొని అసెస్‌మెంట్ నంబర్ పొందారు.
వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి నిర్మాణం చేసుకున్న యజమాని ఇంటి పన్ను చెల్లించడానికి ముందు ఆస్తి పన్ను మదింపు చేసి ఇంటి నంబరు కేటాయిస్తారు. ఈ విధానంలో అవినీతి ఎక్కువ కావడంతో స్వీయ మదింపు విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దాని ద్వారా ఇంటి యజమానే అన్ని వివరాలు పూర్తి చేసి ఆస్తి పన్ను మదింపు చేసుకోవచ్చు. ఈ విధానంలో కూడా లోపాలుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా అక్రమార్కులకు వరంగా మారింది.
బయటపెట్టింది ఇలా..
మల్కాజిగిరి కార్పొరేటర్ గీతానగర్‌లో ఉన్న సర్కిల్ కార్యాలయం భవనాన్ని యాభై గజాలుగా చూపిస్తూ 194 రూపాయలు స్వీయ మదింపు ద్వారా ఆస్తి పన్ను చెల్లించారు. ఆస్తి పన్ను చెల్లించగానే పీటీఐ నంబర్ 1280210792 జనరేట్ అయింది. ఈ విధానంలో ఉన్న లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల తీరు బాధ్యతారాహిత్యం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ మదింపు విధానం పూర్తిగా అక్రమార్కులకు వరంగా మారింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కాజేయడానికి ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నారు. నగరంలోని అన్ని సర్కిళ్లలో ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంతో కోట్లాది రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. ఈ విధానంపై రెవిన్యూ విభాగం అధికారుల తీరు అధ్వానంగా ఉంది. మల్కాజిగిరిలో ఏఎమ్‌సీలను అడిగితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈ విధానం ద్వారా జరిగిన అన్ని ఆస్తి మదింపు (అసెస్‌మెంట్ల)పై కమిటీ వేసి విచారణ జరిపించాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి.
– శ్రవణ్, కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment