Hyderabad: Mallikarjun Kharge Comments Congress President Polls - Sakshi
Sakshi News home page

70 ఏళ్లు దేశానికి మేలు చేశాం.. మోదీ, షా నాశనం చేస్తున్నారు

Published Sat, Oct 8 2022 1:39 PM | Last Updated on Sun, Oct 9 2022 8:38 AM

Hyderabad: Mallikarjun Kharge Comments Congress President Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశానికి చేసిన మేలు ప్రతిచోటా కనిపిస్తుందని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే చెప్పారు. ‘గత 70 ఏళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. ఈ దేశానికి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లను అందించింది కాంగ్రెస్‌. ఏ దేశానికి వెళ్లినా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఎన్నారైలు కూడా కాంగ్రెస్‌ హయాంలో విదేశాలకు వెళ్లిన వారే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, నిర్బంధ విద్య వంటి అద్భుత పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్సే. ఈ దేశాన్ని ధాన్యాగారం చేసింది, సాగునీటి సౌకర్యాలు కల్పించింది, మోదీ అమ్ముతున్న ప్రభుత్వరంగ సంస్థలను సృష్టించింది కాంగ్రెస్‌ పార్టీనే’ అని ఆయన తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్‌కు వెళ్లిన ఖర్గే... టీపీసీసీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో తనకు ఓటేయాలని కోరారు. అనంతరం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ నేతలు రమేశ్‌ చెన్నితల, గౌరవ్‌ వల్లభ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వీహెచ్, మల్లురవి, షబ్బీర్‌ అలీతో కలసి ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ పార్టీ దేశానికి మంచి చేస్తే... మోదీ, అమిత్‌ షాలు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. దేశంలోని ఒక శాతం జనాభా వద్దనే 22 శాతం సంపద పోగుపడిందని, ఉపాధి తగ్గి నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. ఎనిమిదేళ్లలో దేశంలో 7 కోట్ల ఉద్యోగాలు పోయాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయిందన్నారు. అలాగే నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు పెరిగాయని, చివరకు పుస్తకాలపైనా జీఎస్టీ వేశారని ఆక్షేపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ నిలబడాలని, అందుకే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.

చాలా పార్టీలొచ్చాయ్‌..
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం గురించి విలేకరులు ప్రశ్నించగా దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు గా మారాయని, ఏడీఎంకే ఏఐడీఎంకేగా, టీఎంసీ ఏఐటీఎంసీగా మారిందని, కానీ ఏ పార్టీ కూడా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించలేదని ఖర్గే గుర్తుచేశారు.

వాళ్లకు ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు?
ఏఐసీసీ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే దేశ ప్రజల సామాజిక, రాజకీయ, ఆర్థికాభి వృద్ధి కోసం పాటుపడతానని ఖర్గే చెప్పా రు. పార్టీ నియమావళిని తు.చ. తప్పకుండా అమలు చేస్తానని, ఉదయ్‌పూర్‌ తీర్మా నాన్ని సాధ్యమైనంత వరకు అమలు చేస్తా నని హామీ ఇచ్చారు. పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని... పార్టీ నేతలందరితో కలసి పనిచేస్తానని, అందుకే తనకు అన్ని చోట్లా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందన్నారు.

తనపై పోటీ చేస్తున్న వారు కూడా తనకు వ్యతిరేకం కాదని, ఇది పార్టీ అంతర్గత ఎన్నిక అని ఖర్గే వివరించారు. తాను తెలంగాణ బిడ్డనని, అందుకే టీపీసీసీ నేతలంతా తనకు మద్దతిస్తున్నా రని చెప్పారు. తన అభ్యర్థిత్వాన్ని విమర్శించే హక్కు బీజేపీ నేతలకు లేదని, వారికి ప్రజాస్వామ్యం గురించి ఏమాత్రం తెలియ దని ఖర్గే మండిపడ్డారు. అద్వానీ, గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, నడ్డాలలో ఎవరు బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికల ద్వారా గెలిచారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఆచరించలేని వారు ఇతరులకు పాఠాలు చెప్పడం సరికాదన్నారు.  

చదవండి: రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement