టర్నింగులున్నాయి.. డ్రైవింగ్‌ జాగ్రత్త | Hyderabad to Medaram jatara route map details | Sakshi
Sakshi News home page

టర్నింగులున్నాయి.. డ్రైవింగ్‌ జాగ్రత్త

Published Tue, Feb 20 2024 2:19 AM | Last Updated on Tue, Feb 20 2024 2:19 AM

Hyderabad to Medaram jatara route map details - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: హైదరాబాద్‌ నుంచి మేడారం 245 కిలోమీటర్లు. కారులో వెళ్లేవారికి 5.20 గంటల సమయం పడుతుంది. ఎన్‌హెచ్‌–163 రహదారిపై ప్రయాణించే భక్తులు హైదరాబాద్, యాదగిరిగుట్ట, జనగామ, రఘునాథపల్లి, కరుణాపురం, కాజీపేట, ఆత్మకూరు, మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవాలి.  

► ఈ రోడ్డుపై పెంబర్తి శివారులో 90–90.5 కి.మీ. లు, వీఓ హోటల్‌ నుంచి అక్షయ హోటల్‌ 9.5–94 కి.మీ.లలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.  
► జనగామ– నెల్లుట్ల మధ్యలో రోడ్డు దాటేందుకు ఇబ్బందులు తప్పవు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై పలువురు చనిపోయారు.  పెంబర్తి, నిడిగొండ, యశ్వంతాపూర్, రాఘవాపూర్, చాగళ్లు, పెండ్యాల అండర్‌పాస్‌లు లేకపోవడంతో జాతీయరహదారి దాటేందుకు ఇబ్బందులు తప్పవు.  
► నెల్లుట్ల బైపాస్‌ రోడ్డు ఆర్టీసీ కాలనీ బ్రిడ్జి, నడిగొండ యూటర్న్, రఘునాథపల్లి శివారు, ఛాగల్, స్టేషన్‌ఘన్‌పూర్, కరుణాపురం, ధర్మసాగర్‌ మండలం రాంపూర్‌క్రాస్‌రోడ్డు, మడికొండ కందాల దాబా, కాజీపేట డీజిల్‌ కాలనీ, కాజీపేట నుంచి ఫాతిమా ఫ్లైఓవర్, సుబేదారి ఫారెస్టు ఆఫీసు, దామెర మండలం పసరగొండ, ఊరుగొండ శివారు, ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌రోడ్, కటాక్షపూర్‌లను ‘బ్లాక్‌స్పాట్‌’లుగా అధికారులు గుర్తించారు.  
► మల్లంపల్లి, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మూలమలుపుల ముప్పును అధిగమించితే మేడారం చేరుకున్నట్టే.

ప్రత్యేక చర్యలు చేపట్టాం
మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు వెళ్లే వాహనదారులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాం. నిబంధనలకు మించి ఎక్కువ మందిని వాహనాల్లో తరలిస్తే కఠినచర్యలు తీసుకుంటాం.  - పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, హనుమకొండ 

హైదరాబాద్‌ నుంచి మేడారం245 కిలోమీటర్లు  
హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల బస్‌స్టేజీ నుంచి వంగాలపల్లి–కరుణాపురం బస్‌స్టేజీల వరకు మూడు యూటర్న్‌లు ఉన్నాయి.  
► చిన్నపెండ్యాల నుంచి ఘన్‌పూర్‌ వెళ్లాల్సిన వాహనాలు గ్రానైట్‌ సమీపంలో యూటర్న్‌ తీసుకోవాలి. వాహన చోదకులు తక్కువ దూరంలో దాబా హోటల్‌ సమీపంలో రాంగ్‌ రూట్‌లో యూటర్న్‌ తీసుకుంటున్నారు.  
► హనుమకొండ నుంచి చిన్నపెండ్యాల గ్రామంలోకి వెళ్లాల్సిన వాహనాలు దాబా ముందు యూటర్న్‌ తీసుకోవాలి. వాహన చోదకులు గ్రానైట్‌ వద్ద రాంగ్‌ రూట్‌లో యూటర్న్‌ తీసుకుంటున్నారు. దీంతో ఈఏడాది 10 రోడ్డు ప్రమాదాలు జరగగా ఐదుగురు మృతిచెందారు. జాతర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. 

వరంగల్‌ నుంచి మేడారం95.5   కిలోమీటర్లు  
వరంగల్‌ నుంచి మేడారం 95.5 కిలోమీటర్లు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుంటే భక్తులు ఎన్‌హెచ్‌ 163 రహదారి గుండా 2.20 గంటల నుంచి 2.40 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. వరంగల్‌ నుంచి మేడారం వెళ్లే భక్తులు హనుమకొండ, ఆరెపల్లి, దామెర, ఆత్మకూరు, జవహర్‌నగర్, మచ్చాపూర్, చల్వాయి, గోవిందరావుపేట, రాఘవపట్నం, ఇప్పలగడ్డ, మొట్లగూడెం, వెంగ్లాపూర్, నార్లపూర్‌ ద్వారా మేడారం చేరుకుంటారు.  
► ములుగు గట్టమ్మ సమీపంలో మూడు మలుపులుంటాయి. ఇదివరకు ఇక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి.  
► హనుమకొండ–మలుగు మధ్య 163 జాతీయ రహదారి ఆరెపల్లి–గుడెప్పాడ్‌ మధ్య రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా, ఎక్కడా సూచిక బోర్డులు లేనందున జాగ్రత్తగా వెళ్లాలి. 

హైదరాబాద్‌ టు మేడారం : 3 టోల్‌గేట్లు 
హైదరాబాద్‌ నుంచి మేడారం జాతర వచ్చే ప్రయాణికులు మూడు టోల్‌గేట్లు దాటాలి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వద్ద, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమళ్ల వద్ద మరోటి, ములుగు దాటాక జవహర్‌నగర్‌ వద్ద ఇంకో టోల్‌గేట్‌ ఉంటుంది. అయితే జాతర జరిగే 4 రోజులపాటు జవహర్‌నగర్‌ వద్ద టోల్‌ ఎత్తేస్తారు.

మహబూబాబాద్‌ నుంచి మేడారం134  కి.మీ.
సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి నర్సంపేట ద్వారా మేడారం వెళ్లే భక్తులు సొంత వాహనంలో అయితే 134 కిలోమీటర్లు ప్రయాణించాలి. గమ్యస్థానానికి 3.20 గంటల్లో మహబూబాబాద్, గూడూరు, ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, మల్లంపల్లి, జాకారం, ములుగు, జంగాలపల్లి, చల్వాయి, పస్రా, నార్లపూర్‌ల మీదుగా మేడారం చేరుకోవచ్చు.  
► నర్సంపేట నుంచి మేడారం వరకు ఈ దారిలో 30 వరకు మూలమలుపులు ఉన్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు గుర్తించారు. 

తాడ్వాయి మీదుగా అనుమతి వీరికే... 
ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ పాస్‌లు ఉన్న వాహనాలు హనుమకొండ, ములుగు రోడ్డు, గుడెప్పాడ్, పస్రా, తాడ్వాయి నుంచి నేరుగా మేడారం వెళతాయి. ప్రైవేట్‌ వాహనాలు మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, మేడారం వెళ్లాలి. తాడ్వాయి మీదుగా అనుమతి లేదు.
పొరపాటున వెళ్లినా తాడ్వాయి వద్ద వెనక్కి పంపుతారు.  

కరీంనగర్‌ నుంచి మేడారం153 కి.మీ.
కరీంనగర్‌ టు మేడారం 153 కి.మీ.లు. కరీంనగర్, కేశవపట్నం, హుజూరాబాద్, కమలాపూర్, రేగొండల మీదుగా ములుగు చేరుకుని వెంకటాపూర్, చల్వాయిల మీదుగా మేడారానికి 3.40 గంటల సమయం పడుతుంది.  
►  భూపాలపల్లి నుంచి మేడారం 53.8 కిలోమీటర్లు.మల్లంపల్లి, రాంపూర్, దూదేకులపల్లి, బయ్యక్కపేట, తక్కళ్లగూడెం, నార్లపూర్‌ల మీదుగా 1.10 గంటల
నుంచి 1.30ల వ్యవధిలో మేడారం చేరుకోవచ్చు.  
► జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ సమీపంలోని కొత్తపల్లి వద్ద, కాళేశ్వరం– మహదేవపూర్‌ మధ్య మూలమలుపులు ప్రమాద
భరితంగా ఉన్నాయి.  
► కాళేశ్వరం నుంచి ఇసుక లారీలు ఎక్కువగా 353 సీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తాయి. ఒక్కోసారి వీటిని రోడ్డు పక్కనే నిలుపుతారు. వీటివల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ.  
► భూపాలపల్లి, పరకాల, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌ శివారు ప్రాంతాల్లోనూ రహదారి పక్కనే    వాహనాలు నిలుపుతున్నారు. 

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం మీదుగా మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భారీగా తరలివస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, గొండియా జిల్లాలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి భూపాలపట్నం, బీజాపూర్‌ జిల్లాల భక్తులు, తెలంగాణ నుంచి పూర్వపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, చెన్నూర్‌ల నుంచి ఈ దారిగుండా మేడారం జాతరకు వస్తారు.  

కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాటారం వరకు 32 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 353(సీ) పైన 18 అతి ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. దీంతో త్వరగా గమ్యం చేరాలని వాహన దారులు ఆదమరిచి వాహనం నడిపితే మృత్యుఒడిలోకి చేరినట్టే. ఈ రహదారిపై అంతర్రాష్ట్ర వంతెన నుంచి ఎస్సీకాలనీ వద్ద, అన్నారం మూలమలుపు, అడవి మధ్యలోని డేంజర్‌ క్రాసింగ్‌ల వద్ద అనేక ప్రమాదాలు జరిగాయి. కనీసం ఇక్కడ ఎన్‌హెచ్‌ అధికారులు కూడా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.  

చల్వాయి బస్టాండ్‌ : జర చూసి నడపండి  
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామం మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుంది. రెండు మాత్రమే యూటర్న్‌ పాయింట్లు ఉండడం వల్ల వాహనాల్లో ప్రయాణించే వారు, గ్రామస్తులు ఈ పాయింట్స్‌ నుంచే రోడ్డు క్రాస్‌ అవుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.  

► పస్రా, గోవిందరావుపేట గ్రామాల మధ్యలో ఉన్న చర్చి మూలమలుపు ఇప్పటికే చాలా మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎక్కువగా ప్రమాదాలు ఇక్కడే జరుగుతాయి. రోడ్డు పై ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడం, ఈ ప్రాంతానికి రాగానే రోడ్డు వెడల్పుగా కనిపిస్తుంది. దగ్గరలో గ్రామాలు లేకపోవడంతో వాహనదారులు అధికవేగంతో రావడం వల్ల వాహనాన్ని కంట్రోల్‌ చేయలేక, మూలమలుపు తప్పించలేక ప్రమాదాలు జరుగుతుంటాయి. భక్తులు ఇక్కడ చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి.  

ఇవి తప్పనిసరిగా పాటించండి 
► వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పరిమితికి మించిన వేగం మంచిది కాదు.  
► ఓవర్‌టేక్‌ చేసే క్రమంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్‌టేక్‌ చేయకపోవడమే బెటర్‌. 
►మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాతరకు వెళ్లే వాహన చోదకులు మద్యానికి దూరంగా ఉండాలి. 
► మూలమలుపులు, ఇరుకు వంతెనలు, రహదారుల వద్ద వేగం తగ్గించాలి.  

నిర్ణిత స్థలాల్లోనే పార్కింగ్‌ చేయాలి  
జాతరకు వచ్చే భక్తులు వాహనాలను జాతరలో కేటాయించిన స్థలాల్లోనే పార్కింగ్‌ చేయాలి. భక్తులకు తెలిసేలా అన్నిచోట్ల సైన్‌ బోర్డులు ఏర్పాటు చేశాం. జాతర పరిసర ప్రాంతాల్లో 10 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేసి కరెంట్, నీటి సరఫరా అందుబాటులో ఉంచాం. రోడ్లపై అడ్డంగా నిలిపే వాహనాలను ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి టోయింగ్‌ వాహనాలతో తరలిస్తాం.   - అంబర్‌ కిషోర్‌ ఝా ,మేడారం జాతర, ట్రాఫిక్‌ ఇన్‌చార్జ్,వరంగల్‌ సీపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement