సాక్షి, హైదరాబాద్: బడికెళ్లి చదువుకోవాల్సిన వయసులో అత్యంత దారుణానికి ఒడిగట్టారు. తోటి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడింది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. రాజధాని శివారులోని హయత్‌నగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఆగస్టులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు మైనర్లను హయత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని తట్టి అన్నారంలోని ఓ పాఠశాలలో ఐదుగురు బాలురు పదో తరగతి చదువుతున్నారు. అశ్లీల వీడియోలకు బానిసలుగా మారిన వీరు.. తోటి విద్యార్థిని (17)పై కన్నేశారు. ఒకే తరగతి కావడంతో ఆ విద్యార్థిని వారితో సన్నిహితంగా ఉండేది. ఇదే అదనుగా ఆమెపై లైంగిక దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే బాధితురాలి ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడం.. ఆమె ఒంటరిగా ఉండటం చూసి.. ఈ ఐదుగురు బాలురు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని నిందితుల్లో ఒకడు సెల్‌ఫోన్‌లో రికార్డ్ కూడా చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన ఘాతుకాన్ని ఎవరికీ చెప్పకుండా మిన్నుకుండిపోయింది.
బెదిరించి మళ్లీ.. మళ్లీ..
పది రోజుల తర్వాత నిందితుల్లో ఒకడు.. ఆ వీడియోను బాధితురాలికి చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. మరోసారి అత్యాచారం చేసి, దీన్ని కూడా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. తర్వాత ఆ వీడియోను మిగిలిన నలుగురికి వాట్సాప్ ద్వారా షేర్ కూడా చేశాడు. ఇలా నిందితులు పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ.. అత్యాచారం చేస్తుండటంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు గత ఆదివారం హయత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఐదుగురు నిందితులపై పోక్సో చట్టంతోపాటు అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఫార్వర్డ్ చేసినందుకు ఐటీ చట్టం సెక్షన్ 67ఏ, 67బీ కింద కూడా కేసులు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు 24 గంటల్లోనే ఐదుగురు మైనర్ నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అనంతరం జువెనైల్ హోంకు తరలించారు.
వీడియోలు ప్రచారం చేయొద్దు
ఈ కేసుకు సంబంధించి మైనర్ల అత్యాచార వీడియోను ఎవరూ కూడా ఫార్వర్డ్ చేయొద్దని రాచకొండ పోలీసులు చెప్పారు. ఎవరైనా ఈ వీడియోలు చూసినట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేస్తే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: (Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment