సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మ్యూజిక్ సౌండ్ పెట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధన ఉదయం 6 గంటల వరకు వర్తిస్తుందని ఆదేశించింది. నేటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించకుండా పబ్‌లు నిర్వహిస్తున్నారని, నగరవాసులను రాత్రి ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము అధికారులకు విజ్ఞప్తి చేసినా ఆ పబ్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
విద్యా సంస్థలున్న చోట అనుమతి ఎలా ఇచ్చారు?..
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున హైకోర్టు న్యాయవాది కైలాష్‌నాథ్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి సౌండ్ పెట్టరాదని తేల్చిచెప్పింది. నగర పోలీస్ చట్టం, సౌండ్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత సమయం వరకే అనుమతి ఉందని పేర్కొంది.
ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన న్యాయమూర్తి.. ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించింది. పబ్‌లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది. హైదరాబాద్ పరిధిలోని పబ్‌లపై ఇప్పటివరకు దాఖలైన కేసుల వివరాలను అందజేయాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మ్యూజిక్ సిస్టమ్ ప్లే చేసేందుకు ఎన్నిటికి అనుమతి ఉంది.. తదితర వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment