ఏళ్లకు ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న గ్రేటర్ ఆర్టీసీ ఏ రోజుకు ఆ రోజు జీవన్మరణ పోరాటం చేస్తోంది. ప్రతి రోజు రూ.కోట్లల్లో నష్టాలను చవి చూస్తోంది. ఒకప్పుడు మహానగరంలో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందిన ఆర్టీసీ ప్రాభవం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వ సాయం అందితే తప్ప బస్సు చక్రం కదలలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ నిర్వహణను జీహెచ్‌ఎంసీకి అప్పగించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది లోపే ఆ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో ఆర్టీసీ మనుగడ కోసం తిరిగి ఒంటరి పోరాటాన్ని నమ్ముకొంది.
-సాక్షి, హైదరాబాద్
సుదీర్ఘమైన కార్మికుల సమ్మె, రెండేళ్లుగా పట్టిపీడించిన కోవిడ్ మహమ్మారి వంటి పరిణామాలు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ను మరింత కుంగదీశాయి. కొద్ది కొద్దిగా కోలుకుంటున్న తరుణంలో పెరిగిన డీజిల్ ధరల భారం మరోసారి శరాఘాతంగా మారింది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఎంతో ఆశగా ఎదురు చూడడం, ఆ తరువాత తీవ్రమైన నిరాశకు గురకావడం ఆర్టీసీకి తప్పడం లేదు. మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మరోసారి సాయం కోసం ఆర్టీసీ పడిగాపులు కాస్తోంది.
చేతులెత్తేసిన జీహెచ్‌ఎంసీ...
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రవాణా సదుపాయాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులను, సిబ్బందిని జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని భావించారు. కానీ బస్సుల నిర్వహణ భారంగా మాతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావించారు. ఆర్ధిక సాయానికి మాత్రమే ముందుకు వచ్చారు. రెండు దశల్లో సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు అందజేశారు. కానీ ఆ తరువాత ఏటేటా నిధులు ఇచ్చి ఆర్టీసీని ఆదుకొనేందుకు జీహెచ్‌ఎంసీ నిరాకరించింది. ముంబయి వంటి నగరరాల్లో ప్రజా రవాణా, విద్యుత్ సదుపాయం వంటివి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా, జీహెచ్‌ఎంసీ మాత్రం అలాంటి ప్రతిపాదనకు చేతులెత్తేయడం గమనార్హం.
ఆదాయానికి రెట్టింపు నష్టాలు...
నగరంలో సుమారు 2650 బస్సులకు పైగా ఉన్నాయి. రోజుకు 20 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నట్లు అంచనా. గతంలో 3850 బస్సులు ఉండేవి. 34 లక్షల మంది పయనించేవారు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగేవి.కానీ బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ప్రయాణికుల ఆదరణ కూడా క్రమంగా తగ్గడంతో 12 వేలకు పైగా ట్రిప్పులను తగ్గించారు. కోవిడ్ మూడో దశ తరువాత సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కొంత మేరకు పెరిగింది. కానీ బస్సుల నిర్వహణ మాత్రం భారంగానే ఉంది.
ఆర్టీసీలో కార్మికుల సుదీర్ఘమైన సమ్మెకు రోజుకు రూ.కోటి వరకు నష్టం వస్తే ఇప్పుడు అది రోజుకు రూ.2.35 కోట్లకు చేరుకుంది.కోటిన్నర ఆదాయం లభిస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇలా ప్రతి నెలా సుమారు రూ. 75 కోట్ల నష్టాలను ఆర్టీసీ మూటగట్టుకొంటోంది. ఏడాది కాలంలో రూ.850 కోట్ల వరకు చేరినట్లు అంచనా. ప్రతి రోజు డీజిల్ పైనే రూ.1.4 కోట్ల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని అధికారులు తెలిపారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు మెట్రో రైలు, ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సదుపాయాలు నగర ఆర్టీసీకి తీవ్రమైన పోటీనిస్తున్నాయి.
కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత...
సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఆర్టీసీ తాజాగా సన్నాహాలు చేపట్టింది. కానీ నిధుల కొరత అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ఆదుకొంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం ఒక్కటే పరిష్కారం. ప్రగతి చక్రం తిరిగి పరుగులు పెట్టాలంటే కొత్త బస్సులు రోడ్డెక్కాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment