సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ప్రకటించింది. ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వస్తున్నట్టు తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించింది.
యూఎస్‌పీసీ నేతలు సోమవారం హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
బలవంతపు బదిలీలు చేశారు..
టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ, టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో ‘నాన్ లోకల్స్ గో బ్యాక్’ అనే నినాదం బలపడే వీలుందన్నారు. టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. పరస్పర బదిలీల్లోనూ అన్యాయమైన నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వివాహానికి ముందు స్థానికతను ప్రమాణంగా తీసుకుంటే ఎంతోమంది నష్టపోతారని తెలిపారు. పరస్పర బదిలీల్లో సీనియారిటీని కోల్పోవాల్సిన పరిస్థితి టీచర్లకు నష్టం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని డీటీఎఫ్ నేత టి.లింగారెడ్డి అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ఎదురీత తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని టీచర్లు ఎంతమాత్రం సహించలేరని టీపీటీఎఫ్ నేత మైస శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని యూఎస్‌పీసీ టీచర్లకు పిలుపునిచ్చింది. విలేకరుల సమావేశంలో జాదా వెంకట్రావ్, ఎ.రమణ, గాలయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment