ఆస్పత్రి నిర్వాకం: ‘కనుపాప’ను దూరం చేశారు | Hyderabad: Teenage Boy Who Was Anesthetized For Surgery Dies | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నిర్వాకం: ‘కనుపాప’ను దూరం చేశారు

Published Wed, Jan 27 2021 1:37 AM | Last Updated on Wed, Jan 27 2021 10:27 AM

Hyderabad: Teenage Boy Who Was Anesthetized For Surgery Dies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లేకలేక ఆ దంపతులకు పుట్టిన ‘కనుపాప’ను వైద్య నిర్లక్ష్యం దూరం చేసింది. దృష్టి లోపాన్ని సరిదిద్దుకొని రంగుల ప్రపంచాన్ని చూడాలనుకున్న ఆ చిన్నారిని మత్తుమందు శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. మోతాదుకు మించి అనస్తీ్తషియా ఇవ్వడం వల్ల కంటి సర్జరీకి ముందే ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆల్విన్‌ కాలనీ సమీపంలోని శంషాగూడకు చెందిన పానీపూరి వ్యాపారి గణపతిరెడ్డి, కీర్తి దంపతులకు పెళ్లైన పన్నెండేళ్ల తర్వాత కుమారుడు ప్రశాంత్‌ (12) జన్మించాడు. అయితే చిన్నతనం నుంచే అతనికి కంటిచూపు సరిగా లేదు. దీంతో తమ కుమారుడికి చికిత్స చేయించాలని తల్లిదండ్రులు భావించారు.

ఈ నెల 20న పంజాగుట్టలోని అగర్వాల్‌ కంటి ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు... రెండు కళ్లలోనూ పొరలున్నాయని, వాటిని తొలగించేందుకు రెండింటినీ ఒకే సమయంలో సర్జరీ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఈ నెల 21న వైద్యులు సర్జరీకి సిద్ధమయ్యారు. చికిత్స సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియనిస్ట్‌ మత్తుమందు ఇచ్చాడు. అయితే మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో బాలుడు చికిత్సకు ముందే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.  చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు)

గుట్టుచప్పుడు కాకుండా...
ఆపరేషన్‌ థియేటర్‌ టేబుల్‌పై అచేతన స్థితిలో పడి ఉన్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా అగర్వాల్‌ కంటి ఆస్పత్రి వైద్యులు అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తమ వల్ల కాదని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో అదే ఆస్పత్రి అంబులెన్సులో బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఎలాగైనా తమ బిడ్డను కాపాడాల్సిందిగా తల్లిదండ్రులు ఆ ఆస్పత్రి వైద్యులను వేడుకోవడంతో వారు ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకొని బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతిచెందినట్లు సోమవారం రాత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వైద్యులు తప్పుడు ఇంజక్షన్‌ ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం పంజాగుట్ట అగర్వాల్‌ కంటి ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరికి పూర్తిగా చూపు పోయిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజగుట్ట పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి.

ఆస్పత్రికి తాళం.. వైద్యులు పరార్‌
బాలుడు మృతి చెందిన విషయం తెలిసి బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకొని వైద్యు లను నిలదీశారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇచ్చిన వైద్యులు... ఆ తర్వాత ఆస్పత్రికి తాళం వేసి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మా తప్పేమీ లేదు: అగర్వాల్‌ కంటి ఆస్పత్రి
‘కొందరు పిల్లలకు మత్తుమందు పడదు. లక్ష మందిలో ఒకరిలో ఇలాంటి రియాక్షన్స్‌ వెలుగు చూస్తాయి. సర్జరీకి ముందే కార్డియాక్‌ అరెస్ట్‌ అయి అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిం చాం. చికిత్సలో వైద్యుల తప్పిదం లేదు. వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తగు మోతాదులో మత్తుమందు ఇచ్చాం. అధిక డోసు ఇచ్చామనే ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని మీడియా బులెటిన్‌లో అగర్వాల్‌ కంటి ఆస్పత్రి పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement