శ్రీను నాయక్ వద్ద లభించిన నకిలీ ఐడీ
సాక్షి, సిటీబ్యూరో: సీఎం ఓఎస్డీకి పీఏనంటూ ఎర వేసి డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి ఉద్యోగాల వరకు అనేక పేర్లు చెప్పి మోసం చేసిన ఎ.సుధాకర్.. ఐపీఎస్ నుంచి ఎస్‌ఎస్‌బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడిన కర్నాటి గురువినోద్‌కుమార్ రెడ్డి.. పెళ్లి పేరుతో అనేక మంది యువతులకు ఎర వేసి, భారీగా వసూలు చేసి మోసం చేసిన నకిలీ ఆర్మీ మేజర్ ముదావత్ శ్రీను నాయక్.. ఈ ముగ్గురూ తమ ‘పని’ పూర్తి చేసుకోవడానికి నకిలీ గుర్తింపుకార్డులు (ఐడీ) సైతం వినియోగించారు.
మిగిలిన ఇద్దరి కంటే గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఎ.సుధాకర్ ఏడాకులు ఎక్కువే చదివాడు. ఆ ఇద్దరి వద్దా ఒక్కో గుర్తింపు కార్డే లభించగా.. ఇతగాడి వద్ద మాత్రం పీఏ టు సీఎం ఓఎస్డీ (తెలంగాణ సెక్రటేరియేట్) అంటూ మూడు, పోలీసు అధికారి అంటూ నాలుగు, నకిలీ ఓటర్ ఐడీలు మూడు, నకిలీ సెక్రటేరియేట్ ఎంట్రీ కార్డులు మూడు లభించాయి. ఈ నేరగాళ్లను పట్టుకుంటున్న అధికారులు గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారిని మాత్రం పట్టించుకోవట్లేదు.
సొంతంగా సాధ్యం కాదు..
- నకిలీ డాక్టర్లుగా అవతారం ఎత్తే మోసగాళ్లకు బోగస్ గుర్తింపు కార్డులతో పెద్దగా పని ఉండదు. అయితే సూడో పోలీసులు, నకిలీ ప్రభుత్వ అధికారులుగా ‘మారే’ వారికి మాత్రం ఆయా పేర్లు, వివరాలతో ఉండే ఫేక్ ఐడీ కార్డుల అవసరం ఉంటుంది. వీటిని ఆయా నేరగాళ్లు అనేక చోట్ల చూపిస్తూ ఉంటారు. ఈ గుర్తింపు కార్డులను ఎవరికి వారుగా తయారు చేసుకోలేరు.
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న వాటిలోనూ అవసరమైన మార్పు చేర్పులు చేసి లామినేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా నేరగాళ్లు ఏదో ఒక దుకాణాన్ని ఆశ్రయించాల్సిందే. వారికి అధిక మొత్తం ఆశ చూపిస్తున్న నేరగాళ్లు తమకు కావాల్సిన కార్డులు తయారు చేయించుకుంటున్నారు.
- ప్రభుత్వ అధికారులు, పోలీసులకు గుర్తింపు కార్డుల్ని ఆయా విభాగాలే జారీ చేస్తాయి. ఈ విషయం తెలిసినప్పటికీ డబ్బుకు ఆశ పడుతున్న దుకాణాల నిర్వాహకులు నకిలీవి తయారు చేసి ఇస్తున్నారు.
‘స్టాంపుల’పై ఉన్న చర్యలు ఇక్కడేవి?
- ఉద్యోగార్ధులు, వీసా ప్రాసెసింగ్‌తో పాటు పెళ్లి సంబంధాల కోసమూ అనేక మంది నకిలీ సర్టిఫికెట్లు సేకరిస్తూ ఉంటారు. వీటిని తయారు చేసి ఇచ్చే ముఠాలు నగరంలో అనేకం ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ)లతో పాటు శాంతిభద్రతల విభాగం అధికారులూ ప్రతి ఏటా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీదారులపై నిఘా ఉంచి దాడులు చేస్తుంటారు.
- నకిలీ సర్టిఫికెట్ల తయారీకి నేరగాళ్లు ఆయా స్కూళ్లు, యూనివర్శిటీలు, వృత్తి విద్యా సంస్థల పేర్లతో ఉన్న రబ్బర్ స్టాంపుల్ని వాడతారు. ఫేక్ సర్టిఫికెట్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న సందర్భాల్లో పోలీసులు ఈ రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఇచ్చిన వారి వివరాలు ఆరా తీస్తారు. వారినీ గుర్తించి అరెస్టు చేస్తుంటారు.
- భారీ స్థాయిలో నకిలీ పత్రాలతో గ్యాంగ్స్ దొరికినప్పుడు ఈ స్టాంపుల తయారీదారుల్ని పట్టుకోవడానికి టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైమ్ అధికారులు నగరం, రాష్ట్రం దాటి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ‘సూడోగాళ్లను’ పట్టుకున్నప్పుడు మాత్రం వారికి గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చిన వారి విషయంలో ఇలాంటి చర్యలు ఉండట్లేదు. దీంతో ఫేక్ ఐడీ కార్డుల దందా యథేచ్ఛగా సాగుతోంది.
కఠిన చర్యలతోనే అడ్డుకట్ట
నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అవసరమైన రబ్బరు స్టాంపులు తయారు చేసి ఇవ్వడం ఎంత నేరమో.. నకిలీ గుర్తింపు కార్డులు చేసి ఇవ్వడమూ అంతే నేరం. నకిలీ సర్టిఫికెట్లు/ ఐడీ కార్డుల్ని నేరగాళ్లు ఏ నేరానికి వినియోగిస్తారో దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లే తయారీదారుడి మీదా ప్రయోగించాలి. నగరంలో ఏళ్లుగా స్టాంపులు తయారు చేసి ఇస్తున్న వారిపై తీసుకున్న చర్యలను.. గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చే వారిపై తీసుకోవట్లేదు. నకిలీ ఐడీ కార్డులు తయారు చేసే వారిపైనా చర్యలు తీసుకుంటేనే ఈ వ్యవహారాలకు కొంత వరకు అడ్డుకట్ట పడే ఆస్కారం ఉంటుంది.
– నగరానికి చెందిన విశ్రాంత డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment