సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలకు తోడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం కనబరుస్తోంది. ప్రమేయం లేకుండానే లబ్ధిదారులను ఎంపిక చేయడం, టీకాపై ఉన్న అనుమానాలను, అపోహలను నివృత్తి చేయకపోవడంతో ఆశించిన ఫలితం నెరవేరడంలేదు. పరోక్షంగా టీకాల కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం రోజురోజుకు సన్నగిల్లడానికి కారణమవుతోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా భిన్నమైంది. విద్యావంతులు, ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వైద్య పరమైన అంశాలపై వీరికి ఎక్కువ అవగాహన ఉంటుంది. ఇతరులకు మార్గదర్శకంగా నిలవాల్సిన ఉద్యోగులు టీకా వికటిస్తుందనే భయంతో వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అపోహలతో ప్రభుత్వ వైద్యులు టీకాకు దూరంగా ఉంటుంటే.. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వైద్యులు మాత్రం ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం.
మేడ్చల్ ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్
ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో తెలంగాణ వ్యాప్తంగా 1,75,371 మంది హెల్త్‌కేర్ వర్కర్లను గుర్తించి, వారి వివరాలను కోవిన్‌యాప్‌లో నమోదు చేసింది. వీరిలో 109015 మంది (63.6 శాతం) టీకా వేయించుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో 27,728 మంది హెల్త్ వర్కర్లు ఉండగా, వీరిలో కేవలం 9,610 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. టీకాల నమోదులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 94.2 శాతం తొలి స్థానంలో నిలిచింది. మేడ్చల్ 87.9 శాతంతో రెండో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మూడో స్థానంలో, మహబూబాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మేడ్చల్ వ్యాక్సినేషన్‌లో ముందు వరుసలో ఉండగా, ఇక హైదరాబాద్ 38.9 శాతంతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు అవగాహన కల్పించి, వారు టీకా వేయించుకునే విధంగా ప్రోత్సహించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. అనుభవరాహిత్యానికి తోడు, వైద్య సిబ్బందిని సమన్వయం చేసే వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం.
ప్రైవేటులో కొంత మెరుగు
ప్రభుత్వ హెల్త్‌కేర్‌లో పని చేస్తున్న వారితో పోలిస్తే ప్రైవేట్ హెల్త్‌కేర్ వర్కర్లు ఈ విషయంలో కొంత ముందున్నారని చెప్పొచ్చు.తొలి రోజు 5370 మంది టీకా వేసుకున్నారు. ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు అధిపతులు, సీనియర్ వైద్యనిపుణులు ముందు వరుసలో ఉండి తొలి టీకా తీసుకుని, ఇతర సిబ్బందికి మార్గదర్శకంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న చాలా విభాగాధిపతులు వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారిలో 32 మందిలో స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తాయి. వీరిని గాంధీ, నిమ్స్‌కు తరలించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం వీరంతా సురక్షితంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment