సాక్షి, హైదరాబాద్: కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ వ్యాక్సినేషన్‌ను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రపంచ జనాభాలో 17.7 శాతం భారత్‌లోనే ఉండటం... సెకండ్‌వేవ్‌లో వ్యాప్తిచెందిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు తీవ్ర ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో టీకాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం సైతం దృష్టిపెట్టింది. టీకా తయారీ, పంపిణీ, భవిష్యత్ అంచనాలపై ఇంఫాల్‌లోని కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ (సీఏయూ) శాస్త్రవేత్తల బృందం పరిశీలన చేసింది.
టీకా తయారీలో మూడింతల వేగం పెరగాలని, పంపిణీ సైతం ఆదే స్థాయిలో జరిగితే భవిష్యత్‌లో వచ్చే వేవ్‌లను బలంగా ఎదుర్కొనేలా భారత్ తయారవుతుందని తేల్చిచెప్పింది. తాజాగా ప్రఖ్యాత అంతర్జాతీయ హెల్త్ జర్నల్ లాన్సెట్ ఈ నివేదికను ప్రచురించింది.
నెలకు 8 కోట్ల డోసుల ఉత్పత్తి
దేశంలో నెలకు 8 కోట్ల డోసులు (జూన్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం) తయారవుతున్నాయి. ఇందులో కోవిషీల్డ్ 7 కోట్లు, కోవాగ్జిన్, స్పుత్నిక్ కోటి డోసులు తయారు చేస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి రెండు డోసుల టీకాలివ్వగా, మొదటి డోసు తీసుకున్నవాళ్లు 59.99 కోట్ల మంది ఉన్నారు.
దేశ జనాభాతో పోలిస్తే పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నట్లు సీఏయూ–ఇంఫాల్ చెబుతోంది. రెండో డోసు ప్రక్రియ మరింత వేగంగా జరగాల్సిన అవసరముందని చెప్పింది. రోజుకు కోటి డోసులు తయారు చేయడం, అదే వేగంతో సరఫరా చేసినట్‌లైతే డిసెంబర్ ఆఖరుకల్లా 18 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ రెండుడోసుల టీకాలిచ్చే వీలుంటుంది.
ఇంటింటికీ టీకాలివ్వాలి
ప్రస్తుతం వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద మాత్రమే టీకాలు ఇస్తుండగా... మరింత విస్తృతంగా జరగాలని సీఏయూ సూచించింది. టీకా పంపిణీ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడం వల్ల వైరస్ వ్యాప్తికి ఇదో అడ్డాగా మారే ప్రమాదం ఉందని, అందువల్ల క్షేత్రస్థాయిలో టీకాలను పంపిణీ చేయాలని, ఇంటింటికి టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇంటింటికి టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
►టీకా పంపిణీలో డోసుకు డోసుకు మధ్య అంతరాన్ని తగ్గించాలని కూడా సీఏయూ చెప్పింది. గ్యాప్ ఎక్కువగా ఉండకుండా వేగంగా వ్యాక్సిన్ వేస్తే యాంటీబాడీల వృద్ధి కూడా సమర్థవంతంగా జరుగుతుందని తెలిపింది.
►దక్షిణాది రాష్ట్రాల్లో టీకా పంపిణీ వేగంగా జరుగుతోంది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో అవగాహనలేమితో ప్రజలు టీకా తీసుకునేందుకు విముఖత చూపుతున్నారు.
►వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలతో ఉత్తరప్రదేశ్‌లోని జంసాతి గ్రామ ప్రజలు టీకాలకు దూరంగా ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్‌లోని మాల్కండి గ్రామ ప్రజలు టీకా పంపిణీ చేసే అధికారులు, సిబ్బందిపై దాడికి పాల్పడి టీకా వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు.
►ప్రస్తుతం రెండు డోసులు టీకా వేసుకున్న వారిలో కూడా కరోనా వస్తోంది. కానీ వారిలో పెద్దగా దుష్ప్రభావాలు కనిపించకపోవడం శుభపరిణామం.
►కోవిడ్‌తో మరణించిన వారిలో 80 శాతం మంది టీకాలు వేసుకోని వారే.
Comments
Please login to add a commentAdd a comment