కారులో చెలరేగిన మంటలు.. యువకుడు అప్రమత్తమవ్వడంతో | Hyderabad : Youth Pulls Woman, Kids From Burning Car At Expressway | Sakshi
Sakshi News home page

కారులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో బయటపడిన బాధితులు

Published Tue, Jul 13 2021 10:37 AM | Last Updated on Tue, Jul 13 2021 11:15 AM

Hyderabad : Youth Pulls Woman, Kids From Burning Car At Expressway - Sakshi

దగ్ధమవుతున్న కారు , పిల్లలతో సురక్షితంగా బయటపడిన శైలజ

సాక్షి, రాజేంద్రనగర్‌: ఓ కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పహాడిషరీఫ్‌ మామిడిపల్లి ప్రాంతానికి చెందిన శైలజ తన మూడు నెలల చిన్నారిని బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చూపించేందుకు మరో కుమారుడు శ్రీహాన్స్‌ (6), తన సోదరి కుమారుడు విజయ్‌ (12)తో కలసి కారులో బయలుదేరింది.

వాహనం ఆరాంఘర్‌ పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా మెహదీపట్నం వైపు వెళుతోంది. మార్గమధ్యలోని అత్తాపూర్‌  పిల్లర్‌ నెంబర్‌ 132 వద్దకు రాగానే కారు వెనుక నుంచి పొగలు వస్తుండటాన్ని శైలజ కుమారుడు గమనించాడు. విషయం చెప్పగానే వాహనాన్ని పక్కకు ఆపి చూసే సరికి మంటలు ఎగిసి పడుతున్నాయి. డోర్‌ లాక్‌ తీసి తన మూడు నెలల చిన్నారిని బయటకు తీసింది. అప్పటికే వెనుక డోర్‌ లాక్‌ పడటంతో ఇద్దరు చిన్నారులు లోపలే చిక్కుకుపోయారు.

ఈ దారి గుండా వెళ్తున్న రవి అనే యువకుడు వెంటనే స్పందించాడు. కారు అద్దాలను పగులగొట్టి ఇద్దరు చిన్నారులను సురక్షితంగా బయటకు తీశాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌సుందర్‌ సందర్శించారు. శైలజతో పాటు ముగ్గురు చిన్నారులను సురక్షితంగా మరో వాహనంలో ఇంటికి చేర్చారు.  

ఆరా తీసిన గవర్నర్‌.. 
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మహేశ్వరంనియోజకవర్గ పరిధిలోని కేసీ తండాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హాజరై వెళ్తున్న క్రమంలో ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. కారు ప్రమాదం జరిగిన దృశ్యాన్ని చూస్తూ ముందుకు వెళ్లారు. విషయాన్ని తన అధికారుల బృందాన్ని అడిగి తెలుసుకున్నట్లు రాజేంద్రనగర్‌ పోలీసులు తెలిపారు. గవర్నర్‌ కాన్వాయ్‌ వెళ్లిన అనంతరం ట్రాఫిక్‌ను ఎక్స్‌ప్రెస్‌వేపైకి అనుమతి ఇచ్చారు.   


చిన్నారులను కాపాడిన రవిని అభినందిస్తున్న ఏసీపీ సంజయ్‌కుమార్‌    

శభాష్‌ రవి
నగరానికి చెందిన రవి తన కారులో ఆరాంఘర్‌ నుంచి మెహదీపట్నం వైపు వెళ్తున్నాడు. అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 130 వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు మంటల్లో చిక్కుకోవడంతో తన వాహనాన్ని పక్కకు ఆపి కారు వెనుక అద్దాలను పగులగొట్టాడు. మంటల్లో చిక్కుకున్న ఇద్దరు చిన్నారులను బయటకు తీసి వారి ప్రాణాలను కాపాడాడు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించిన రవిని రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్‌ కనకయ్య, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్యామ్‌సుందర్‌ అభినందించారు. శైలజ సైతం కృతజ్ఞతలు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement