బర్గర్ ప్రియులకు కేరాఫ్. ఫ్లమ్ కేక్ పేస్ట్రీ లవర్స్‌కు వన్‌స్టాప్. యూత్‌కి మహా క్రేజీగా వర్ధిల్లిన యూనివర్సల్ రెస్టారెంట్ అండ్ కన్ఫెక్షనరీ మూతపడింది. ఇది జరిగి 2 వారాలు కావస్తున్నా ఒకరి తర్వాత ఒకరుగా తెలుసుకుంటున్న నగరవాసులు యూనివర్సల్ బేకరీ జ్ఞాపకాలను నెమరేసుకుంటూనే ఉన్నారు. నగరంలో మున్నెన్నడూ లేని విధంగా ఒక ఫుడ్ జాయింట్ మూసివేత గురించి ట్విట్టర్‌లో స్పందిస్తుండడం విశేషం.
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో యూనివర్సల్ బేకరీ అంటే తెలియని బర్గర్ ప్రియులు ఉండరు. సికింద్రాబాద్ మహాత్మా గాంధీ రోడ్డులోని దాదాపు ఏభై ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన బేకరీ ఇది. ఇటీవల ఒక్కసారిగా మూతపడడంతో ఆ బేకరీ రుచులను దానితో ముడిపడిన పలు స్నేహాలు, అనుబంధాలను నగరవాసులు మరచిపోలేకపోతున్నారు.
డైయిలీ రొటీన్...
మహిళా కస్టమర్లు ఎక్కువగా కనపడని ఇరానీ ఫుడ్ జాయింట్స్‌కి భిన్నంగా ఈ బేకరీ తగినంత మంది మహిళా కస్టమర్లతో నిత్యం కళకళలాడేది. కళాశాల విద్యార్థులకు ఇక్కడి బర్గర్ ఒక డైలీ రొటీన్‌లో భాగం అంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాక ఆ రోడ్డుకు షాపింగ్‌కి వెళ్లే వారికి యూనివర్సల్ తప్పనిసరి విజిటింగ్ ప్లేస్‌గా ఉండేది.
పోటీని తట్టుకుని..
సన్నగా తరిగిన మటన్, టమాటాలు, ఉల్లిపాయలు, ఛీజ్ వగైరాలు మేళవించిన ఇక్కడి మటన్, చికెన్ బర్గర్లు అందరికీ అందుబాటు ధరలో రూ.50కే దొరికేవి. అసలైన హైదరాబాదీ బర్గర్‌కి సిసలైన చిరునామాగా ఉంటూ మూతపడే నాటికి కూడా పూర్తి స్థాయిలో కస్టమర్లతో కిటకిటలాడిన బేకరీ ఇది. అందుకే బర్గర్ కింగ్, మెక్ డొనాల్డ్స్, సబ్ వే లాంటి ఎన్నో రకాల ఆధునిక ఫుడ్ జాయింట్స్, కాఫీ షాప్స్ నగరంలో ఏర్పాటైనప్పటికీ యూనివర్సల్ బేకరీ తన క్రేజ్‌ను ఏ మాత్రం కోల్పోలేదు.
చదవండి: కారు ప్రమాదంపై ట్విస్టుల మీద ట్విస్టులు
మూతపడటానికి కారణాలేమిటి?
హిమాయత్ నగర్‌లో ఏర్పాటు చేసిన యూనివర్సల్ బేకరీ స్వల్ప కాలంలోనే గత 2016లో మూతపడింది. సరైన పార్కింగ్ సౌకర్యం లేక అది మూతపడిందని, అయితే చాలా పాతదైన దాని మాతృసంస్థ కూడా తాజాగా మూతపడడానికి ప్రత్యేక కారణాలేవీ లేవని తెలుస్తోంది. ఈ బేకరీని ముగ్గురు భాగస్వాములు నిర్వహిస్తుండగా వీరంతా నగరానికి దూరంగా వెళ్లిపోవడం వారసులు ఇతరత్రా వ్యాపారాలతో బిజీ అయిపోవడం వల్ల నిర్వహణ కష్టమై ఈ బేకరీ బిజినెస్‌ను వదులుకున్నట్టు నిర్వాహకుల సంబంధీకులు చెబుతున్నారు.
ఓ మధుర జ్ఞాపకం..
గొప్ప జ్ఞాపకం అంటూ యూనివర్సల్ బేకరీని గుర్తు చేసుకుంటున్నారు నగరవాసులు. ట్విట్టర్ వేదికగా మిస్ యూ యూనివర్సల్ అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. అంతేకాదు తిరిగి బేకరీని తెరవాలంటూ విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న స్పందన తమకు ఎంతో ఆనందానుభూతినిస్తోందని బేకరీ యజమానులు
చెబుతున్నారు.
యాభై ఏళ్ల అనుబంధం
యూనివర్సల్ బేకరీ పెట్టిన దగ్గర నుంచీ రెగ్యులర్‌గా వెళ్లడం అలవాటు అయింది. దేశీ స్టయిల్ బర్గర్ అక్కడ ఉన్నట్టు ఇంకెక్కడా దొరికేది కాదు. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్... ఈ మూడింటిలోనూ బెస్ట్. జనరల్ బజారుకు వెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని ఆ బేకరీ దగ్గర లోనే కారు ఆపి స్నాక్స్ తినడం ఫ్యాక్స్ ఇంటికి తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆ బేకరీ తీసేశారు అంటుంటే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది.
– అనురాధారెడ్డి, ఇంటాక్ సంస్థ
Comments
Please login to add a commentAdd a comment