![IB Officer Dies after Accidental fall at Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/19/04.jpg.webp?itok=Uimtngxc)
కుమార్ అమరేష్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కోసం ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు స్టేజీపై నుంచి జారిపడి ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది.
స్థానిక సీఐ రవీంద్ర ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌లోని పాట్నాకు చెందిన కుమార్ అమరేష్(51) కోఠిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఐబీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పుస్తక ఆవిష్కరణ మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు.
చదవండి: (ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ)
ఈ నేపథ్యంలో ముందస్తు భద్రతా తనిఖీల్లో భాగంగా బుధవారం ఐబీ అధికారులు శిల్పకళా వేదికకు వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్న కుమార్ అమరేష్ స్టేజీపై నుంచి 12 అడుగుల లోతులో ఉన్న మెయింటెనెన్స్ డెక్ మెట్లపై పడ్డారు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అతడిని సమీపంలో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.
కోమాలోకి వెళ్లిన ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 7 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బదిలీపై నాలుగు సంవత్సరాల కిందట హైదరాబాద్‌కు వచ్చిన కుమార్ అమరేష్‌కు కొద్ది నెలల క్రితమే డిప్యూటీ డైరెక్టర్ నుంచి అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..)
Comments
Please login to add a commentAdd a comment