Heavy Rains: తెలంగాణలోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ | Sakshi
Sakshi News home page

Heavy Rains: తెలంగాణలోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Published Mon, Sep 6 2021 2:35 AM

Imd Alert Heavy Rains Are Likely In Next Two Days In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలిపింది. రుతుపవనాల ద్రోణి తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో ఐదురోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఏపీలోనూ రాబోవు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. 

నేడు, రేపు భారీ వర్షాలు... 
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. సోమవారం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే వర్షాలు మరింత ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది. మంగళవారం కూడా ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. 

నాగిరెడ్డిపేటలో 17 సెంటీమీటర్ల వర్షం... 
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో 17 సెం.మీ. వర్షం కురవగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో 15.4 సెం.మీ. వర్షం కురిసింది. నైరుతి సీజన్లో ఇప్పటివరకు 61.58 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఆదివారం నాటికి 78.86 సెం.మీ. వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి నాగరత్న తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల భారీ వర్షాలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement