శంకరపట్నం (మానకొండూర్): పెళ్లికూతురు మెడలో తాళికట్టే సమయానికి బండి కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు మొండికేయడంతో అతిథిగా వెళ్లిన ఎమ్మెల్యే తానుబండి కొనిస్తా అని డబ్బులు ఇచ్చి వివాహంజరిపించిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌లో చోటుచేసుకుంది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య కూతురు అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్‌తో కుదిరింది.
రూ.5 లక్షల కట్నంతో పాటు మోటార్ సైకిల్ కొనిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. కట్నం డబ్బులు ముట్టచెప్పారు. మొలంగూర్ శివారులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం పెళ్లి మండపానికి వధువు, వరుడి బంధువులు చేరుకున్నారు. కొత్తజంటను ఆశీర్వదించేందుకు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయంలో మోటార్ సైకిల్ కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా.. అని వరుడు వినయ్ మొండికేశాడు.
దీంతో వరుడు, వధువు బంధువులు గొడవకు దిగడంతో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుని పెళ్లి కొడుకు వినయ్‌తో మాట్లాడి మోటార్ సైకిల్ కొనుక్కోమని సొంత డబ్బులను (సుమారు రూ.50వేలు) అప్పటికప్పుడే పందిట్లోనే అందించారు. మిగతా సొమ్ము కూడా తానే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం దగ్గరుండి వివాహం జరిపించి నూతన జంటను ఆశీర్వదించారు. తోడబుట్టిన అన్నగా పెళ్లి మండపంలో పరువు కాపాడావని మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ కన్నీరు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment