సాక్షి, హైదరాబాద్: బయటకు ఎప్పుడు వస్తారో తెలియదు. స్వదేశానికి ఎప్పుడు చేరుకుంటారో తెలియదు. బయట ఏం జరుగుతోందో అంతకన్నా తెలియదు. ప్రస్తుతానికి వర్సిటీ అధికారులు ఆహారం అందిస్తున్నా.. బంకర్లలో భయం భయంగా ఎన్నాళ్లు ఉండాలో. సైరన్ మోగితే గుండెలదిరి పోతున్నాయి. మళ్లీ సైరన్ మోగేదాకా గుండె అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండాలి.
ఇదీ ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థుల దుస్థితి. ప్రస్తుతానికి ఉక్రెయిన్ సరిహద్దు యూనివర్సిటీల్లో ఉన్న భారతీయ విద్యార్థులనే అధికారులు స్వదేశానికి తీసుకురాగలుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీలకు చెందిన పదుల సంఖ్యలో విద్యార్థులు మాత్రమే స్వస్థలాలకు చేరుకోగా.. సరిహద్దు సమీప వర్సిటీల్లో, అలాగే జపోరిజ్జియా, మైకోలివ్ వంటి సరిహద్దుకు దూరంగా ఉండే వర్సిటీల్లో ఇంకా సుమారు 2 వేలమంది ఉక్రెయిన్‌లోనే క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు.
ఆ ఆనందం ఇక్కడ లేదు..
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల కష్టాలు కొనసాగుతున్నాయి. అక్కడి వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని జపోరిజ్జియా నుంచి విద్యార్థులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. తెలుగు విద్యార్థులు ఎక్కువగా ఈ వర్సిటీలోనే చదువుతుంటారు. ప్రస్తుతం వర్సిటీ అధికారులు, ఇండియన్ ఎంబసీ ఆదేశాల మేరకు బంకర్లలో తలదాచుకున్నామని వారు చెప్పారు. స్వదేశాలకు విద్యార్థుల తరలింపు ప్రక్రియ మొదలైందన్న ఆనందం వారి మాటల్లో వ్యక్తం కావడం లేదు. ఇప్పటివరకు స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన వారు 39 మంది ఉన్నారు.
వీళ్ళంతా రొమేనియా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బొకోవినియన్ వర్సిటీల్లాంటి యూనివర్శిటీల్లోనే చదువుతున్నారు. రుమేనియా సరిహద్దు ప్రాంతం ఇప్పటివరకు ప్రశాంతంగానే ఉంది. రొమేనియాకు దాదాపు 50 కిలోమీటర్లలో దూరంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి యుద్ధ భయం లేదని విద్యార్థులు తెలిపారు. దీంతో అధికారులు సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లోని భారతీయ విద్యార్థులనే స్వదేశాలకు తరలించినట్టు స్పష్టమవుతోంది. బొకోవినియన్ వర్సిటీ నుంచి 45 నిమిషాలు బస్సులో ప్రయాణిస్తే రొమేనియాలోని బుకారెస్ట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.
ఈ నేపథ్యంలోనే అక్కడి విద్యార్థులు రొమేనియా చేరుకుని, అక్కడినుంచి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. అలాగే రాజధాని కీవ్‌లో ఉన్న వారిని పోలెండ్ సరిహద్దులకు బస్సుల్లో తీసుకువెళ్లి, అక్కడ నుంచి విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. అయితే రొమేనియా సరిహద్దుకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపోరిజ్జియా యూనివర్సిటీలోని తెలుగు విద్యార్థులు ఒక్కరు కూడా స్వరాష్ట్రానికి చేరలేదు. వీరిని రొమేనియా సరిహద్దుకు తరలించాలంటే ఉక్రెయిన్ అధికారుల అనుమతులు అవసరం. వీళ్ళను ప్రత్యేక రైలు ద్వారా బోర్డర్ దాటించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే విద్యార్థులు ఇక్కడే చిక్కుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ..
ఉక్రెయిన్ నిర్మాణాల్లో బంకర్లు నిర్మించుకోవడం సాధారణం. అసలీ వ్యవస్థ ఉంటేనే అక్కడి ప్రభుత్వాలు నిర్మాణాలకు అనుమతిస్తాయి. జపోరిజ్జియా యూనివర్సిటీలో గతంలో నిర్మించి న బంకర్లను ఇటీవల ఆధునీకరించారు. వందల మంది తలదాచుకునేలా ఏర్పాటు చేసినవి కావడంతో వీటిని క్రీడా స్థలాలుగా, జిమ్ సెంటర్లుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు వీటినే ప్రాణ రక్షణకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ప్రాం తాల వారితో సహా తెలుగు విద్యార్థులు కూడా అక్కడే రక్షణ పొందుతున్నారు. ఎక్కువ మంది కారణంగా విశాలమైన బంకర్లు ఇరుకుగా మా రాయని విద్యార్థులు తెలిపారు. కాలకృత్యాలకు ఇబ్బందిగా ఉందని చెప్పారు.
ప్రస్తుతానికి ఆహారం అందుతున్నా.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిప్పలు తప్పేలా లేవని అంటున్నారు. దగ్గర్లోనే చెరువు ఉండటం వల్ల తాగునీటికి సమస్య లేదని, యుద్ధ తీవ్రత పెరిగితే ఆ నీళ్లు విషపూరితంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. బంకర్లలో కొంతమంది మెలకువతో ఉంటే, కొంతమంది నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment