దుర్భర కష్టాల నుంచి విముక్తి పొందాలన్న ఆకాంక్షతో అవకాశాలను అన్వేషిస్తూ ఎంత దూరమైనా పోవటానికి సిద్ధపడటం మనిషి నైజం. దీన్ని ఆసరాచేసుకుని మానవ వ్యాపారం చేస్తున్న మాయగాళ్ల ఆటకట్టించటం ప్రభుత్వాలకు అసాధ్యమా? గత కొన్ని నెలలుగా మీడియాలో వస్తున్న కథనాలు ప్రజల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎక్కడో ఉద్యోగమని, ఏదో చదువని నమ్మి అప్పులు చేసి, ఏజెంట్లకు లక్షలకు లక్షలు పోసి విమానాలు ఎక్కుతున్న యువకులు చివరకు అత్యంత ప్రమాదకరమైన యుద్ధ క్షేత్రాల్లో తేలుతున్నారు. ఏ క్షిపణి దాడులకో, బాంబు పేలుళ్లకో బలవుతున్నారు. లేదా దుర్భ రమైన చాకిరీలో ఇరుక్కుని బయటపడే మార్గం దొరక్క అల్లాడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీనుంచి రష్యా వెళ్లిన యువకుడు కిరాయి సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటూ కన్ను మూశాడు.
కేరళకు చెందిన మరో వ్యక్తి ఇజ్రాయెల్‌లో పనిచేస్తూ హమాస్ రాకెట్ దాడిలో చని పోయాడు. మరో ఏడెనిమిదిమంది యువకులు తమను కాపాడాలంటూ రష్యానుంచి వీడియో కాల్‌లో ప్రాధేయపడ్డారు. కిరాయి సైన్యాల్లో పనిచేసినవారు తిరిగొచ్చాక తగిన ఉపాధి చూపకపోతే సమస్యాత్మకంగా మారే ప్రమాదం కూడా వుంటుంది. నిరుడు డిసెంబర్‌లో ఫ్రాన్స్‌లో మన దేశంనుంచి నికరాగువా, సోమాలియా వంటి దేశాలకు వెళ్లే 300 మందిని అనుమానం వచ్చి నిలువరిస్తే ఏజెంట్ల మాయ బయటపడింది. వీరిలో చిన్న పిల్లలు సైతం వున్నారు. చట్టవిరుద్ధ మార్గాల్లోనైనా అమెరికా పోయి డాలర్ల పంట పండించుకోవాలని ప్రయత్నించేవారూ పెరిగారు. 2022 అక్టోబర్– 2023 సెప్టెంబర్ మధ్య 96,917 మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించటానికి విఫలయత్నం చేసి పట్టుబడ్డారు.
ఇది అంతకుముందు సంవత్సరంకన్నా అయిదు రెట్లు అధికం. అమెరికా పోవా లంటే వీసా రావటం అంత తేలిక కాదు గనుక ఇతరేతర మార్గాలు వెదుక్కుంటున్నారు. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాలకు టూరిస్టు వీసాలు లభించటం పెద్ద కష్టం కాదు. అక్కణ్ణించి వేర్వేరు చోట్లకు వెళ్తున్నారు. ఇలాంటివారు వెనకబడిన రాష్ట్రాలనుంచి కాదు, సంపన్న రాష్ట్రాలనుంచే అధికంగా వుండటం ఆందోళన కలిగించే అంశం. ఎక్కువగా గుజరాత్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల యువకులు ఈ వలలో చిక్కుకుంటున్నారు. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సీబీఐ సాగిస్తున్న దాడుల్లో ఢిల్లీ చుట్టుపక్కలా, దేశంలోని వివిధ నగరాల్లో దర్జాగాబ్రాంచీలు పెట్టుకుని మనుషుల్ని రవాణా చేస్తున్న ముఠాల ఆచూకీ బట్టబయలైంది. సామాజిక మాధ్యమాల ద్వారా, స్థానిక ఏజెంట్ల ద్వారా యువకులకు వలవేసి ఈ ముఠాలు తీసుకు పోతున్నాయి.
రష్యా వెళ్లేవారికి మంచి ఉద్యోగాలంటూ నమ్మించి తీరా ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రానికి బలవంతంగా తరలిస్తూ వారి ప్రాణాలను పణం పెడుతున్నారు. అనేకులు యుద్ధంలో తీవ్రంగా గాయపడి సాయం చేసే దిక్కులేక ఆసుపత్రుల్లో విలవిల్లాడుతున్నారు. ఇలా యువకులను తీసుకెళ్లిన ఉదంతాలు 35 వరకూ బయటపడ్డాయని సీబీఐ అంటున్నది. మరెందరు వీరివల్ల మోసపోయారో తేలాలి. హమాస్ నుంచి, హిజ్బుల్లా నుంచి నిరంతరం రాకెట్ దాడులు సాగుతున్న ఇజ్రాయెల్‌లో నిర్మాణరంగంలో తాత్కాలిక అవకాశాలున్నాయంటూ రిక్రూట్‌మెంట్ మొదలెడితే హిందీ భాషా రాష్ట్రాలనుంచి అత్యధికులు క్యూ కట్టారు. ప్రభుత్వ కనుసన్నల్లో జరిగిన ఈ రిక్రూట్‌మెంట్ కోసం వచ్చినవారిని మీడియా కదిలిస్తే ఆకలితో చచ్చేకన్నా పనిచేస్తూ ప్రాణాలు పోగొట్టుకోవటం నయమన్న జవాబొచ్చింది. తమ ప్రాణాలు పోయినా కుటుంబాలకు ఎంతో కొంత అందుతుందన్న ధీమా వారిది. ఎంత విషాదకర స్థితి!
మరో ఆరేళ్లలో మన దేశం ఏడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వఅంచనాలు చెబుతున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనాను అధిగమించటం మరెంతో దూరంలో లేదని ఆర్థికరంగ నిపుణులు ఊరిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వున్న 6.1 శాతం వృద్ధి రేటు ఈ ఏడాది చివరికల్లా 6.8 శాతానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. నిరుద్యోగిత తగ్గిందని, కొనుగోలు శక్తి బాగా పెరిగిందని, తయారీ రంగం పుంజుకుందని గణాంకాలు అంటున్నాయి. అయినా ఇంతమంది ఎందుకు వలసబాట పడుతు న్నారు? ఇబ్బందులుంటాయని తెలిసినా తప్పుడు మార్గాల్లో అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఆర్థికవ్యవస్థ వెలుగులీనటం నిజమే అయినా అందులో సామాన్యులకు వాటా లేకపోతే సాధించిన అభివృద్ధికి అర్థమేముంటుంది? యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతున్నామంటే లోపం ఎక్కడుందో ఆత్మపరిశీలన చేసు కోవాల్సిన అవసరం లేదా? యుద్ధ క్షేత్రాలవైపు పోయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని మన విదేశాంగ శాఖ ఈమధ్య ఒక ప్రకటన చేసింది. మంచిదే. కానీ అదొక్కటే సరిపోతుందా?తమ విధానాలను విమర్శిస్తారనుకున్నవారిని దేశంలో అడుగుపెట్టకుండా విమానాశ్రయాల నుంచే వెనక్కిపంపుతున్నారు.
పరాయిగడ్డపై దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారన్న శంకతో కొంద రిని బయటికి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. కానీ మనుషుల్ని మోసపుచ్చి వారిని అక్రమంగా తరలి స్తున్న మాయదారి ముఠాలకు కళ్లెం వేయటం ఎందుకు సాధ్యపడదు? ఇది ఎన్నికల నామ సంవ త్సరం గనుక కనీసం ఇప్పుడైనా ఉపాధి కల్పనకూ, తయారీరంగ పరిశ్రమలు పుంజుకోవటానికీ, వ్యవసాయ అనుబంధరంగాల్లో పనులు పుష్కలంగా లభించటానికీ చర్యలు తీసుకోవాలి. గణాంకాలు కళ్లు చెదిరేలావుండొచ్చు. కానీ అవి కడుపు నింపవు.
Comments
Please login to add a commentAdd a comment