నర్సరీ మొక్కలకు ‘బయోపాట్స్‌’ | Innovative Ideas By School Students Newest Invention | Sakshi
Sakshi News home page

నర్సరీ మొక్కలకు ‘బయోపాట్స్‌’

Published Sun, Sep 19 2021 4:19 AM | Last Updated on Sun, Sep 19 2021 4:19 AM

Innovative Ideas By School Students Newest Invention - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ పాఠశాల విద్యార్థిని వినూత్న ఆలోచన సరికొత్త ఆవిష్కరణకు పురుడుపోసింది. మొక్కల పెంపకంలో సహజత్వానికి, నూతనత్వానికి పాదులు వేసింది. మొక్కల పెంపకానికి నర్సరీల్లో ఉపయోగించే నల్లరంగు ప్లాస్టిక్‌ కవర్లతో జరుగుతున్న నష్టాన్ని కళ్లారా చూసిన 14 ఏళ్ల విద్యార్థిని శ్రీజ మదిలో కొత్త ఆలోచన మెదిలింది. కవర్లకు బదులుగా వేరుశనగ పొట్టు మిశ్రమంతో తయారు చేసి కుండీల్లో మొక్కలు పెంచితే పర్యావరణహితంగా ఉంటుందని శ్రీజ భావించింది.

తన సహ విద్యార్థి రామకృష్ణ, గణిత ఉపాధ్యాయుడు ఆగస్టీన్‌ సహకారంతో జీవకుండీలు తయారు చేయడంలో విజయం సాధించింది. కుండీల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు కూడా స్థానికంగా లభించేవి కావడం శ్రీజ ఆవిష్కరణకు మరింత ఉపయోగపడింది. శ్రీజ చేసిన ఆవిష్కరణకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌తోపాటు సీఎస్‌ఐఆర్‌ తదితర ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు లభించింది.  

టీ వర్క్స్‌ బయోప్రెస్‌ యంత్రాల తయారీ 
జీవకుండీలుగా పిలిచే బయోపాట్స్‌ తయారీకి రూపొందించిన ‘బయోప్రెస్‌’యంత్రాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు టీ వర్క్స్‌ సన్నాహాలు చేస్తోంది. జీవకుండీలను వివిధ రూపాలు, వేర్వేరు సైజుల్లో తయారు చేసేందుకు, ఇంట్లో లభించే స్టీలు గ్లాసులు, ఇతర వంటపాత్రలను శ్రీజ మోల్డ్‌ (అచ్చులు)గా ఉపయోగించింది.

మరోవైపు జీవకుండీల తయారీ ప్రయోగాలలో శ్రీజకు టీ వర్క్స్‌ సహకారం అందిస్తోంది. శ్రీజ రూపొందించిన బయోపాట్‌ ఫార్ములేషన్‌కు పేటెంట్‌ సాధించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని టీ వర్క్స్‌ ప్రకటించింది. ఒక్కో బయోప్రెస్‌ యంత్రానికి నెలకు ఒక్కో షిఫ్ట్‌లో 6 వేల జీవకుండీలను తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. బయోప్రెస్‌ యంత్రం డిజైన్‌కు మార్పులు, చేర్పులు చేస్తే నెలకు 50 వేల కుండీలను కూడా తయారు చేసే అవకాశముంది.  

బయోప్రెస్‌ ద్వారా ఉపాధి అవకాశాలు 
టీఎస్‌ఐసీ చేపట్టిన గ్రామీణ ఆవిష్కరణల అభివృద్ధి కార్యక్రమం కింద శ్రీజ జీవకుండీలు(బయో పాట్స్‌) ఆవిష్కరించింది. శ్రీజ, ఆమె మార్గదర్శి ఆగస్టీన్‌తో బయోపాట్స్‌ తయారీపై కలసి పనిచేస్తున్న టీఎస్‌ఐసీకి సహకరించేందుకు టీ వర్క్స్‌ ముందుకు వచ్చింది. గ్రామీణ వాతావరణానికి అనువుగా ఉండేలా బయోపాట్స్‌ తయారీ యంత్రం ‘బయోప్రెస్‌’ను టీ వర్క్స్‌ తయారు చేసింది. ఈ యంత్రం ద్వారా గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 
– సుజయ్‌ కారంపూరి, సీఈవో, టీ వర్క్స్‌

జీవకుండీల మార్కెటింగ్‌పై దృష్టి 
2020 ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో శ్రీజ ఆవిష్కరణ మా దృష్టికి వచ్చింది. ఈ ఆవిష్కరణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతోపాటు ఇతర చోట్ల జీవకుండీల వినియోగం పెరిగేలా మార్కెటింగ్‌పై దృష్టి పెడుతున్నాం. ఈ కుండీల తయారీ నిమిత్తం మహిళా స్వయం సహాయక సంఘాలకు అవసరమైన శిక్షణ ఇస్తాం.     
– డాక్టర్‌ శాంత తౌటం, చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్, టీఎస్‌ఐసీ 

పడేసిన ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయం ఆలోచించా 
హరితహారంలో నల్ల ప్లాస్టిక్‌ కవర్లు తొలగించి వృథాగా పడేయడం నాలో ఆలోచనను కలిగించింది. కవర్లు చింపే క్రమంలో మొక్కల వేరు వ్యవస్థ దెబ్బతింటుందని గమనించా. దీంతో మా గ్రామంలో దొరికే వేరుశనగ పొట్టును మిశ్రమంగా చేసి బయోపాట్స్‌ తయారు చేశా. మొక్కతోపాటు 20 రోజుల వ్యవధిలో కుండీ కూడా భూమిలో కలిసి నైట్రోజన్, ఫాస్ఫరస్‌ వంటి ఎరువుగా పనిచేసింది.  
– శ్రీజ, జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని, చింతలకుండ, జోగుళాంబ గద్వాల జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement