తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ | Inquiry into Telangana University VC irregularities | Sakshi
Sakshi News home page

తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్రమాలపై విచారణ

Published Sat, Apr 29 2023 4:33 AM | Last Updated on Sat, Apr 29 2023 11:54 AM

Inquiry into Telangana University VC irregularities - Sakshi

యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలను ‘థాంక్యూ సాక్షి’ పేరిట ఫ్లెక్సీగా ముద్రించి క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విద్యార్థులు

తెయూ (డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ పాల్పడిన అక్రమ చెల్లింపులు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారం కమిటీ సభ్యులు గంగాధర్‌గౌడ్, వసుంధరదేవి, ప్రవీణ్‌కుమార్‌ వర్సిటీని సందర్శించారు. వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని కలిసి 2021 నవంబర్‌ నుంచి 2023 ఏప్రిల్‌ 18 వరకు వర్సిటీ బ్యాంక్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

ఆ మధ్యకాలంలో జరిపిన చెల్లింపులపై విచారణ జరపనున్నారు. వర్సిటీకి విచారణ కమిటీ రాక సందర్భంగా విద్యార్థులు ‘థాంక్యూ సాక్షి’అంటూ క్యాంపస్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’పత్రికకు ధన్యవాదములు’అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఫ్లెక్సీల ఏర్పాటు సోషల్‌ మీడియాలో వైరలైంది. వర్సిటీలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది.

ఈ నెల 19న హైదరాబాద్‌ రూసా భవనంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, ఆ శాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పాలకమండలి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ సమావేశానికి హాజరైన వీసీ ప్రొఫెసర్‌ డి.రవీందర్‌ వాకౌట్‌ చేసి బయటకు వెళ్లిపోయారు.

అనంతరం వీసీ అక్రమాలపై విచారణ కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రకళ, నలుగురు ఈసీ మెంబర్లతో కలిపి పాలకమండలి కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఈ నెల 26న జరిగిన పాలకమండలి సమావేశంలో ఏ విధంగా విచారణ జరపాలనే విషయమై కమిటీ సభ్యులకు మార్గనిర్దేశనం చేశారు.  

ఈసీ నిర్ణయాలు తాత్కాలికంగా రద్దు చేసిన హైకోర్టు 
ఈ నెల 19న జరిగిన తెలంగాణ యూనివర్సిటీపాలక మండలి(ఈసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతరంగా రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ తెలిపారు.

ఈ సమావేశంలో వీసీ అధికారాలు తగ్గించడం, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా విద్యావర్ధినిని తొలగించి ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించడం, వీసీపై వచ్చిన ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు వంటి నిర్ణయాలను ఈసీ తీసుకున్న విషయం తెలిసిందే.

ఈసీ నిర్ణయాలపై తాను హైకోర్టును ఆశ్రయించగా, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని వీసీ తెలిపారు. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తుందని ప్రొఫెసర్‌ యాదగిరి తెలిపారు.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement