సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్... మొఘల్‌పుర... కాలాపత్తర్... రామ్‌గోపాల్‌పేట్... కార్ఖానా... ఇలా నగరంలో వరుసగా దారుణాలు వెలుగులు చూస్తున్నాయి. ప్రతి ఉదంతంలోనూ నలిగిపోయింది మాత్రం బాలికలే. జూబ్లీహిల్స్, కార్ఖానా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మైనర్లు ఉన్నారు. ఈ పెడ ధోరణి వెనుక పోర్న్ వెబ్‌సైట్ల ప్రభావం ఎక్కువగానే ఉంటోందని పోలీసులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌లో ఉన్న వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటంతో చర్యలకు ఆస్కారం ఉండట్లేదంటున్నారు. నిఘా సంస్థలు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీని పరిగణించినంత తీవ్రంగా ఇతర అశ్లీలతను పరిగణించట్లేదు.
‘చేతుల్లోకి’ రావడంతో తేలికైంది..
కొన్నేళ్ల క్రితం అశ్లీల చిత్రాలు చూడాలంటే ప్రత్యేకించి సినిమా థియేటర్లు ఉండేవి. ఆ తర్వాత వీడియో క్యాసెట్లు రూపంలో అందుబాటులోకి రావడంతో వీసీపీ, టీవీ ఉంటేనే వీటిని చూడటానికి ఆస్కారం ఉండేది. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల వాడకం పెరిగిన తర్వాత నెట్‌కేఫ్‌లతో పాటు ఇళ్లల్లోనూ ఈ ‘దృశ్యాలు’ కనిపించడం మొదలైంది. అప్పట్లో ఎదుటి వారు చూస్తారనే భయం, అదే జరిగితే పరువు పోతుందనే ఆందోళన యువతలో ఉండేది. స్పార్ట్‌ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత ఈ పోర్న్ సైట్లన్నీ వాటి నుంచే చూసేందుకు అవకాశం చిక్కింది. ఈ కారణంగానే అనేక మంది యువత పోర్నోగ్రఫీకి బానిసలుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొందరు అదుపుతప్పి జీవితాన్ని బుగ్గి చేసుకుంటున్నారు.
చదవండి: (Hyderabad: బస్‌పాస్ చార్జీలు భారీగా పెంపు?)
ఆ సర్వర్లు ఇక్కడ లేకపోవడంతో...
పోర్న్ వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. తెలివిమీరిన వీటి నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్‌సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు ఏర్పాటు చేసి మరో సైట్ ప్రారంభిస్తున్నారు. వీటిపై ఫిర్యాదులు అందే వరకు యథేచ్ఛగా ఇంటర్నెట్‌లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్‌సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. ఈ కారణంగానే వరుసగా ఫిర్యాదులు వచ్చిన వెబ్‌సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఇక్కడి చట్టాలు అక్కడి వారికి పట్టకపోవడంతో నిర్వాహకుల వివరాలు కోరుతూ లేఖలు రాసినా, ఈ– మెయిల్స్ పంపినా వారి నుంచి ఎలాంటి స్పందన ఉండట్లేదు. ఇది పోర్న్ వెబ్‌సైట్స్ నిర్వాహకులకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీన్ని అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు.
ఆ చర్యలు మిగిలిన వాటిపై లేవు..
ప్రస్తుతం చైల్డ్ పోర్నోగ్రఫీని మాత్రమే తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధమూ కొనసాగుతోంది. ఇంటర్నెట్‌తో పాటు సోషల్ మీడియాలో సాగుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి అమెరికాకు చెందిన యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డన్ర్ (ఎన్‌సీఎంఈసీ) పని చేస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇంటర్‌నెట్, సోషల్‌మీడియా వంటి సైబర్ స్పేస్‌లో ఉన్న అంశాలను సీఎంఏఎంగా పరిగణిస్తారు. దీన్ని గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను రూపొందించింది. గూగుల్, యాహూ సహా ఇతర సెర్చ్ ఇంజిన్లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ తదితర సోషల్ మీడియా ఉన్న సీఎస్‌ఏఎంలను గుర్తించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.
అలాంటి చర్యలు వీటికీ అవసరం..
ఆయా సైబర్ స్పేస్, సోషల్ మీడియాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయాలను కనిపెట్టడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఆయా వేదికలపై సీఎస్‌ఏఎంకు సంబంధించి ఎవరైనా సెర్చ్ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్ చేసినా, అప్‌లోడ్ చేసినా.. తక్షణం గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం వారి వినియోగించిన ఐపీ అడ్రస్‌లను గుర్తిస్తుంది. ఈ సమాచారం స్థానిక పోలీసులకు ఇచ్చి నిందితులను అరెస్టు చేయిస్తుంది. చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉన్న మాదిరిగానే ఇతర అశ్లీల అంశాలపైనా చర్యలు అవసరమన్నది నిపుణుల మాట. పోర్న్‌సైట్స్‌ను ఎవరు సెర్చ్ చేసినా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపైనా సుమోటో కేసుల్ని నమోదు చేయాలని ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment