గొల్లకుంట తండా కొత్త పంచాయతీ కార్యాలయం
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. కొత్త పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు కావస్తున్న రిజిస్ట్రేషన్, ఇళ్ల నిర్మాణాలకు పాత పంచాయతీల సర్పంచ్‌లే అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో కొత్త పంచాయతీలు కనిపించడం లేదు. కొత్త పంచాయతీలకు వచ్చే ఆదాయం విడిపోయిన పాత పంచాయతీలకే అందుతుండటంతో కొత్త పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లు ఎమిచేయలేని పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు. మెదక్ జిల్లాలో 2018 ఆగస్టులో 150 గ్రామ పంచాయతీలు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 జనవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. పాలక వర్గాలు ఏర్పడ్డాయి. అల్లాదుర్గం మండలంలో గొల్లకుంట తండా, నడిమితండా, సీతానగర్ గ్రామాలు కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యయి.
కొత్త పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు గడిచినా ఆన్‌లైన్‌లో వివిధ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే గ్రామ పంచాయతీలు పేర్లు రావడం లేదు. గ్రామాలలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర పనుల కోసం ఉపయోగించుకునేందుకు గ్రామ పంచాయతీలు ఎన్‌ఓసీ (నోఅబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇవ్వాలి. ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టాలన్న పంచాయతీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులకు సంబంధించి రుసుము పంచాయతీలకు చెల్లించాల్సి ఉంటుంది. వీటి అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో చేస్తే కొత్త పంచాయతీలకు సంబంధించి ఎలాంటి వివరాలు చూపించడం లేదు. పాత పంచాయతీల పేరుపై ఉండటంతో కొత్త పంచాయతీలకు ఆదాయం జమకావడంలేదు. ఇక పాత పంచాయతీల సర్పంచ్‌లే అనుమతులు ఇస్తుండటంతో ఆ పంచాయతీల ఖాతాలకే ఆదాయం జమవుతుంది. ఇలా కొత్త పంచాయతీలు ఆదాయాన్ని కల్పోతున్నాయి. జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి కొత్తవాటికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.
వివరాలన్నీ ఆన్‌లైన్ చేయాలి
కొత్త పంచాయతీల సర్వే నంబర్లు, పంచాయతీల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. మీ సేవా కేంద్రాల్లో సంబంధిత పనుల కోసం దరఖాస్తు చేసుకుంటే పంచాయతీ పేర్లు ఆన్‌లైన్‌లో రావడం లేదు. పాత పంచాయతీల మధిర గ్రామాలుగానే చూపిస్తుంది. ఇలా పాతవాటినే చూపుతుంటంతో పంచాయతీలు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించాలి. – సోని రాథోడ్, సర్పంచ్, గొల్లకుంటతండా
ఆదాయమే లేదు
కొత్త పంచాయతీలకు ఆదాయమే లేదు. ఆన్‌లైన్ కాకపోవడం, రికార్డులు లేకపోవడం, పంచాయతీ పరిధిలో రిజిష్ట్రేషన్‌లు, ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న కొత్త పంచాయతీల ఆనుమతులు తీసుకోవడం లేదు. పాత పంచాయతీల సర్పంచ్‌ల నుంచి తీసుకుంటుడటంతో మా పంచాయతీ పరిధిలో ఏమి జరుగుతుందో తెలియడం లేదు. సర్పంచ్, కార్యదర్శిని ఎవరూ సంప్రదించడం లేదు. అధికారులు కొత్త పంచాయతీలకు ఆదాయం వచ్చే చర్యలు తీసుకోవాలి. – రంజిత్ నాయక్, సర్పంచ్, నడిమితండా
కొత్త పంచాయతీలను ఆన్‌లైన్ చేయిస్తా
జిల్లాలో 150 కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంచాయతీలకు సంబందించిన హద్దులు, సర్వే నంబర్లు సేకరించాం. వీటిని ఆన్‌లైన్ చేయిస్తాం. ఈ సర్వే నంబర్లలో రిజిష్ట్రేషన్ కార్యాలయం ద్వారా క్రయవిక్రయాలు జరిపితే సంబందిత పంచాయతీలకు కొంత పర్సంటేజి ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో మాట్లాడి కొత్త పంచాయతీలకే ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – హనూక్, డీపీఓ
Comments
Please login to add a commentAdd a comment