దాదాపు ఏడాదిన్నర కింద చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వైరస్ సోకగా.. లక్షల మంది బలయ్యారు. ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి, భవిష్యత్తులో మరింతగా నమోదవుతాయన్న అంచనాలూ ఉన్నాయి. మరి ఇంతగా అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ (సార్స్ కోవ్–2) బరువెంతో తెలుసా?ఎన్ని వైరస్‌లు శరీరంలోకి ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది? ఈ ప్రశ్నలు చూడటానికి మామూలుగానే ఉన్నా సమాధానాలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ కరోనా వైరస్‌ల ‘లెక్కల’పై ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. వైరస్‌ల సంఖ్య, వాటి బరువుతోపాటు అసలు ఇప్పటివరకు పుట్టిన కరోనా వైరస్‌ల మొత్తం బరువెంత అనే అంశాలనూ లెక్క తేల్చారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా?
ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం.. కనీసం వెయ్యి ఆపైన సంఖ్యలో కరోనా వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశిస్తేనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకన్నా తక్కువ సంఖ్యలో అయితే వ్యాధిగా మారడం దాదాపు ఉండదు. మన చర్మం అన్నిరకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను ఎదుర్కొని శరీరంలోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అందువల్ల కళ్లు, ముక్కు, నోటి ద్వారానే వైరస్ శరీరంలోకి ప్రవేశించగలుగుతుంది. గాల్లోనూ ఎక్కువ దూరం వెళ్లలేదు. ఈ క్రమంలోనే మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం వంటివి కరోనా జాగ్రత్తలుగా మారాయి.
శరీరంలో వంద కోట్లకుపైనే..
మన శరీరంలోకి ప్రవేశించిన వైరస్.. తనకు అనుకూలమైన కణాల్లో చేరి పున రుత్పత్తి చెందడం మొదలుపెడుతుంది. ఇన్‌ఫెక్ట్ అయిన ఒక్కో మానవ కణంలో కొన్ని వేల వైరస్‌లు ఉత్పత్తి అవుతాయి. కోవిడ్ వ్యాధిగా మారే సరికి వ్యక్తులను బట్టి వైర స్‌ల సంఖ్య ఉంటుంది. స్వల్ప లక్ష ణాలు ఉన్నవారిలో వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వైరస్‌లు ఉంటే.. తీవ్ర లక్షణాలు ఉన్న వారిలో పది వేల కోట్ల వరకు వైరస్‌లు తయారవుతాయి. ఓ రకంగా చెప్పాలంటే.. భూమ్మీద ఉన్న మొత్తం మనుషుల సంఖ్య కంటే.. ఒక పాజిటివ్ వ్యక్తిలో ఎక్కువ సంఖ్యలో కరోనా వైరస్ కణాలు ఉంటాయి.
ఒక్కో వైరస్ బరువెంత..?
మనను ఇంతగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బరువెంతో తెలుసా?.. ఒక ఫెమ్టోగ్రామ్. అంటే ఒక గ్రాములో పది కోట్ల కోట్లవ వంతు. ఇంకోలా చెప్పాలంటే.. ఒకటి పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య (పది కోట్ల కోట్లు)లో వైరస్‌లు కలిపితే.. ఒక గ్రాము బరువు ఉంటాయి. అంటే లక్ష మందిలో ఉన్న వైరస్‌లు అన్నింటినీ కలిపితే ఒక గ్రాము బరువు అవుతాయన్న మాట. అదే ఒక్కొక్కరిలో ఉండే మొత్తం వైరస్‌ల బరువెంతో చెప్పాలంటే.. సుమారు ఒక మైక్రోగ్రాము నుంచి పది మైక్రోగ్రాముల వరకు ఉంటుంది.
అంతా కలిపితే మూడు కిలోలైనా ఉండవు..
అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది వరకు కరోనా బారినపడగా.. 37 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా సోకినా లెక్కల్లోకి రానివారూ భారీ సంఖ్యలోనే ఉంటారు. దానికితోడు ఒక్కొక్కరిలో వైరస్ తీవ్రత ఒక్కో రకంగా ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని వైరస్ బరువు లెక్కలు వేశారు.
►ప్రపంచవ్యాప్తంగా రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్యను బట్టి చూస్తే.. ఒక్కో రోజు జీవంతో ఉన్న వైరస్‌ల బరువు 10 గ్రాముల 100 గ్రాముల వరకు ఉంటు ంది. (కరోనా వచ్చి తగ్గినవారిలో వైరస్ చనిపోతుంది. కొత్తగా ఇన్పెక్ట్ అయినవారిలో పెరుగుతూ వస్తుంది. కాబట్టి.. ఎప్పటికప్పుడు లెక్క మారుతుంది)
►కరోనాను గుర్తించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏర్పడిన వైరస్ కణాలన్నింటి మొత్తం బరువు రెండు, మూడు కిలోల వరకే ఉంటుందని అంచనా.
►అధికారిక వివరాల మేరకు 18 కోట్ల మందిలో ఒక్కొక్కరిలో గరిష్టంగా 10 మైక్రోగ్రాములుగా లెక్కించినా.. 1,800 గ్రాములు (1.8 కిలోలు) వైరస్ అవుతుంది. అనధికారిక అంచనాల ప్రకారం.. 50 కోట్ల మందికిపైనే కరోనా సోకినట్టు అంచనా. ఎక్కువ, తక్కువ వైరల్ లోడ్‌ను బట్టి చూస్తే.. వైరస్ అంతా మూడు కిలోల వరకు ఉండొ చ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఈ లెక్కలన్నీ చేసిందెలా?
ఇజ్రాయెల్‌కు చెందిన వీజ్‌మాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు రాన్ మిలో, రాన్ సెండర్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. గతంలో రీసస్ రకం కోతుల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌పై జరిగిన పరిశోధనలో తేలిన అంశాలను తాజా అధ్యయనానికి ఆధారంగా తీసుకున్నారు. రీసస్ కోతులు, మనుషుల్లో సుమారు 93% డీఎన్‌ఏ (జన్యువులు) ఒకటే. దాదాపుగా అన్ని రకాల వ్యాధులు, వైరస్‌లు, బ్యాక్టీరియాల వంటివి మనుషుల తరహాలోనే వీటికీ సోకుతాయి. ఈ నేపథ్యంలోనే రీసస్ కోతుల్లో కరోనా లక్షణాలు ఏయే స్థాయిలో ఉన్నప్పుడు.. వాటి అవయవాలు, కణజాలాల్లో వైరస్ ఎంతెంత మొత్తంలో వైరస్ ఉన్న దీ అన్న లెక్కలను తీసుకున్నారు. మనుషుల్లోనూ కరోనా తీవ్రత స్థాయిలను పరిశీలించి, పోల్చి చూసి అంచనాలు రూపొందించారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment