సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి ప్రయత్నిస్తే.. ఆ మరుక్షణమే ఎక్కడికక్కడ విధుల బహిష్కరణ (స్టాప్ ది వర్క్) చేపడతామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు విద్యుత్ ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.
విద్యుత్ పంపిణీ రంగ ప్రైవేటీకరణ లక్ష్యంతో కేంద్రం తీసుకొస్తున్న ఈ సవరణలతో ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మనుగడ ప్రమాదంలో పడనుందని, తమ ఉద్యోగాలకు ముప్పువాటిల్లుతుందని.. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని ఇటీవల కేంద్ర విద్యుత్‌మంత్రి ఆర్‌కే సింగ్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కూడా గురువారం ఇక్కడ సమావేశమై.. బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది.
సీఎండీకి వినతిపత్రం..
విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ నిర్ణయాల మేరకు రాష్ట్రంలో సైతం ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్టు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు తెలిపారు. ‘విద్యుత్ రంగాన్ని రక్షించండి–దేశాన్ని కాపాడండి’ పేరుతో ఈ నెల 10 నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామన్నారు. విద్యుత్ సంస్థల కార్యాలయాలు, ప్లాంట్ల ఎదుట నిరసనలు చేపడతామన్నారు.
సెప్టెంబర్‌లో దేశం నలుమూలల నుంచి విద్యుత్ విప్లవయాత్ర(బిజ్లీ క్రాంతి యాత్ర)ను ప్రారంభించి డిసెంబర్ తొలివారం నాటికి ఢిల్లీకి చేరుకుంటామని చెప్పారు. తర్వాత ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు జేఏసీనేతలు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్ మంత్రి వీకే సింగ్‌కు సైతం లేఖ పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment