సాక్షి, హైదరాబాద్: మోదీకి మొగుడిని అవుతానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. కేసీఆర్ శిఖండిగా మారాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేసీఆర్ మోదీ కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో జరిగిన ధర్నా కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జాగీర్ కాదని స్పష్టం చేశారు. రైతు బంధు ఒట్టి మోసమని పేర్కొన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఎక్కడ పుడితే ఏంటి? పేదల బాధలు తెలిసిన మనిషి సోనియా గాంధీ అని జీవన్ రెడ్డి తెలిపారు. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు. మంత్రులను రోడ్లపై కూర్చోపెట్టిన కేసీఆర్ వ్యవసాయ చట్టంపై యూ టర్న్ తీసుకున్నాడని తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించిందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment