కొలిక్కి వస్తున్న లెక్కలు!  | Job Vacancies Calculations In Telangana Government Has Almost Done | Sakshi
Sakshi News home page

కొలిక్కి వస్తున్న లెక్కలు! 

Published Sun, Dec 20 2020 8:52 AM | Last Updated on Sun, Dec 20 2020 8:57 AM

Job Vacancies Calculations In Telangana Government Has Almost Done - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై లెక్క దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. ఈ లెక్కల కోసం గత మూడు రోజులుగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, అధిపతులతో భేటీ అయి ఖాళీల వివరాలను సేకరించారు. దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలు జరిగాయి. గురు, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ సమావేశాల్లో భాగంగా కొన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని, దాదాపు 40 వేలకుపైగా పోస్టుల లెక్క తేలిందని తెలుస్తోంది. మిగిలిన శాఖల నుంచి పూర్తి స్థాయిలో లెక్కలు వస్తే ఆ సంఖ్య 50 వేలు దాటుతుందని అంచనా.

కాగా, వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను ప్రాధాన్యతల వారీగా భర్తీ చేయాలని, అన్నీ ఒకేసారి కాకుండా అత్యవసర ఖాళీలను ముందు భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాఖల వారీగా వచ్చే ఖాళీల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను త్వరలోనే జీఏడీ అధికారులు సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్నారు. ఈ నివేదిక ప్రకారం వారం రోజుల్లో సమీక్షించనున్న సీఎం కేసీఆర్‌.. ఉద్యోగ ఖాళీల విషయంలో అనుసరించాల్సిన విధానంపై తుది నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మరికొన్ని శాఖలకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. పాఠశాల విద్యకు సంబంధించిన లెక్కలు సోమ, మంగళ వారాల్లో జీఏడీ, ఆర్థిక శాఖలకు అందించనున్నట్లు సమాచారం. ఈ సమాచారం మేరకు టీచర్‌ పోస్టుల ఖాళీలపై ఓ స్పష్టత రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement