సాక్షి వరంగల్/ఎంజీఎం: ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వేధింపులు భరించలేక. గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారోనని భయపడింది. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా వేధింపులు తగ్గలేదు. ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే తనలోతాను కుమిలిపోయి ఓ పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది.
అదీ ఆస్పత్రిలో డ్యూటీగా ఉండగా జరగడంతో కలకలం సృష్టించింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్నితండాకు చెందిన ధరావత్ నరేందర్ వరంగల్‌లోని ఆర్‌పీఎఫ్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. చిన్న కుమార్తె అయిన ప్రీతి(26) ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని కేఎంసీలో అనస్తీషియా పీజీ కోర్సులో 2022లో చేరింది. ప్రస్తుతం థియరిటికల్ క్లాస్‌లు జరుగుతున్నాయి.
ఇక్కడే వేధింపులు
అనస్తీషియా వైద్య విభాగ డ్యూటీ చార్టులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఈఓటీ)లో రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒక ఎస్‌ఆర్, ఒక సీనియర్ పీజీ, ఇద్దరు జూనియర్ పీజీ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తుంటారు. కొన్ని రోజులుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తోంది.
ఇక్కడ పరిచయమైన సీనియర్ సైఫ్ కొంతకాలంగా వేధిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ప్రిన్సిపాల్ మోహన్‌దాసు ఆదేశాల మేరకు అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం సైఫ్, ప్రీతిలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనే అనుమానం కలుగుతోంది.
ట్రెమడాల్ ఇంజక్షన్ ఎప్పుడు వాడుతారంటే..
ట్రెమడాల్ హైడ్రోక్లోరైడ్ 50 ఎంజీ ఇంజక్షన్ కీళ్లు, కండరాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో మితమైన, తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, అస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చికిత్స పొందుతున్న పరిస్థితినిబట్టి మోతాదు, వ్యవధిని డాక్టర్ నిర్ణయిస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.
మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు..
విద్యలో ఎదురయ్యే ఎలాంటి మానసిక ఒత్తిళ్లకు తలొగ్గే విద్యార్థిని ప్రీతి కాదని బంధుమిత్రులు పేర్కొంటున్నారు. కరోనా సమయంలోనూ సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో ఉద్యోగులకు సేవలందించిందని తెలిపారు. ప్రీతి తండ్రి రైల్వే విభాగంలో చేస్తున్న క్రమంలో తన తండ్రితో విధులు నిర్వర్తిస్తున్న వారి ఆరోగ్య సంరక్షణకు సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో విస్తృత సేవలందించిందని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుంది..?
ప్రీతి ఏ ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యకు యత్నించిందో ఎవరూ అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ప్రీతి అనస్తీషియా ఇంజక్షన్ల సమాచారం కోసం తన సెల్‌ఫోన్‌లో తీవ్రంగా సెర్చ్ చేసినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్న సందర్భంలో తీసుకునే ట్రెమడాల్ ఇంజక్షన్ తీసుకున్నట్లు కొందరు వైద్యులు పేర్కొంటున్నారు.
కానీ.. ప్రీతి ట్రెమడాల్ ఇంజక్షన్ కాకుండా అనస్తీషియా తీసుకోవడం వల్ల కార్డియాక్ అరెస్టుతోపాటు తన శరీరంలో పలు అవయవాలు పనిచేయకుండా పోయాయని మరికొందరు వైద్యులు చర్చించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో అనస్తీషియా ఇంజక్షన్ వికటించిన సందర్భంలో సైతం ఇద్దరు రోగులు కార్డియాక్ అరెస్టు కావడం వల్ల చనిపోయిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు.
మంత్రుల ఆరా..
ప్రీతి ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాసు, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేధింపులు అయితే విచారణ కేసు పక్కదారి పట్టకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా స్పందించారు. సీపీ రంగనాథ్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తల్లిదండ్రులు ఏమంటున్నారంటే..
కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్, వేధిస్తున్న సీనియర్ విద్యార్థి సైఫ్‌పై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించిందని తండ్రి తెలిపారు. ఈనెల 20న ఏడుస్తూ కాల్ చేసిందని, పీజీ సీనియర్ డాక్టర్ అరాచకంపై ఏసీపీ కిషన్‌కు చెప్పినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో తనపై ఫిర్యాదు చేస్తావంటూ మరోసారి సైఫ్ ప్రీతిని బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని చెప్పాడు.
ఎంజీఎం సూపరింటెండెంట్ ఏమన్నారంటే..
ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో పలు అంశాలు వివరించారు. ఆపరేషన్ థియేటర్‌లో ప్రీతి కాకుండా విధుల్లో ఉన్న మరో అమ్మాయి, అబ్బాయితో మాట్లాడితే ఇంజక్షన్ ఏమీ తీసుకోలేదన్నారని తెలిపారు. ఆమెను పరిశీలిస్తే కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్(కార్డియో పులుమోనరీ రెసిటేషన్) ద్వారా చికిత్స చేసి ట్రీట్‌మెంట్ అందించామని చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఏజెక్షన్ ఫ్రాక్షన్ ఒఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతికి థైరాయిడ్ సమస్య, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టుగా తేలిందని చంద్రశేఖర్ తెలిపారు.
కొన్ని రోజుల నుంచి ఓ అబ్బాయి వేధిస్తున్నాడు..
కొద్ది రోజుల నుంచి ఓ అబ్బాయి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయాన్ని తన సోదరికి, కుటుంబ సభ్యులకు చెప్పింది. మాట్లాడుదామని భరోసా ఇచ్చాం. ఉదయం ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని మాకు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
– దేవేందర్, ప్రీతి మేనమామ
Comments
Please login to add a commentAdd a comment