తెలంగాణ భవన్‌లో ఎల్.రమణకు కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సమైక్య పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే నీటి పారుదల రంగానికి పూర్తిగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. ఇన్నాళ్లూ పరాయి పాలకుల చేతిలో పరాదీనమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తునక అని అభివర్ణించారు. టీటీడీపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన ఎల్.రమణ, శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
నా లైన్ ఎవరూ మార్చలేరు
‘రాష్ట్రం వస్తుందని ముందు నుంచే మేము బలంగా నమ్మాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము చేసిన పనుల గురించి డబ్బా కొట్టు కోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము చేపట్టిన ఎజెండాతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో మేము విఫలమైతే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మునుపే పునర్నిర్మాణంపై బాగా ఆలోచించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ డం ద్వారానే శాంతి సాధ్యమవుతుందని భావించాం. అందులో భాగంగానే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగం బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. మీ దీవెనలు, అండదండలు, సహకారం ఉన్నన్ని రోజులు ప్రపంచంలో ఎవరూ నా లైన్ మార్చలేరు. నేను కలగన్న తెలంగాణను వంద శాతం చేరుకుంటా.. ’అని కేసీఆర్ స్పష్టం చేశారు.
చేనేతకు చేయూత: ‘చేనేత రంగం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన కార్యక్రమాలు కొంత ఉపశమనం ఇస్తున్నాయి. తాజాగా రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా బీమా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించాం. ఒకటి రెండు నెలల్లో ఈ కార్యక్రమం ఆచరణలోకి వస్తుంది. ఉద్యమ సమయంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పార్టీ తరఫున ఆదుకున్నాం. సూరత్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికుల నైపుణ్యాన్ని స్థానికంగా వాడుకుని ఉపాధి కల్పించేందుకు ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏర్పాటయ్యే భారీ స్పిన్నింగ్ మిల్లుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించా. చేనేత కార్మికులు కూడా పాత పద్ధతిలో కాకుండా వినూత్నంగా పని చేయడాన్ని అలవరుచుకోవాలి. చేనేత రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది..’అని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment