సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన తెలంగాణకు చెందిన డాక్టర్ కోవా లక్ష్మణ్‌కు జాతీయ పార్టీకి సంబంధించిన రెండు అత్యున్నతస్థాయి కమిటీల్లో స్థానం లభించింది. అత్యున్నత నిర్ణాయక కమిటీలైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీల్లో కె.లక్ష్మణ్‌ను సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ రాష్ట్ర బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు అన్నివిధాలుగా గుర్తింపునిస్తోంది. దక్షిణాది నుంచి కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతో పాటు లక్ష్మణ్ మాత్రమే పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.
ఇప్పటికే లక్ష్మణ్‌ను పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, ఇటీవల యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన జాతీయ నాయకత్వం తెలంగాణకు, ముఖ్యంగా వెనుకబడినవర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించింది. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నగర పార్టీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, బీజేఎల్పీనేతగా, పార్టీ అధ్యక్షుడిగా, వెనుకబడిన వర్గాలకు చెందిన నేతగా లక్ష్మణ్ తనదైన గుర్తింపు పొందారు. 2017లో ఉపరాష్ట్రపతి అయ్యేదాకా తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉండేవారు. చిత్తశుద్ధితో పని చేసే నేతలను, వారి అనుభవాన్ని పార్టీ ఎంతగా గుర్తిస్తుందో చెప్పేందుకు లక్ష్మణ్ తదితరులకు అవకాశమే తాజా నిదర్శనమని బీజేపీ వర్గాలు తెలిపాయి. ‘‘లక్ష్మణ్, యడియూరప్ప, జతియా పార్టీ కోసం తమ జీవితాలను ధారపోశారు. ఒక్కో ఇటుకా పేర్చి పార్టీ నిర్మాణానికి పాటుపడ్డారు’’అంటూ కొనియాడాయి.
సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది
‘‘పార్టీలో సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమిది. ఏలాంటి రాజకీయ నేపథ్యం లేని నాలాంటి ఓ కార్యకర్త అంకిత భావంతో పనిచేస్తే గుర్తింపు ఒక్క బీజేపీలో తప్ప మరెక్కడా సాధ్యం కాదు. చాలా సంతోషాన్ని కలిగించింది. నాపై పార్టీ అధినాయకత్వం ఉంచిన నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెడతా. ఈ కమిటీల ద్వారా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’’.
–డాక్టర్ కె.లక్ష్మణ్
చదవండి: చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..
Comments
Please login to add a commentAdd a comment