కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్‌లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్‌ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు.
విద్యుత్ కాంతులతో జిగేల్
కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్‌కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్‌మంటోంది.
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
Published Thu, Aug 6 2020 3:00 AM | Last Updated on Thu, Aug 6 2020 3:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment