సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ కళా సంస్కృతులను పరిచయం చేస్తూ కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ‘కరీంనగర్ కళోత్సవాలు’ఈనెల 30న మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. కళోత్సవాల నిర్వహణకు సంబంధించి మంగళవారం ఆ జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్రానికి చెందిన పలువురు కళాకారులు, స్థానిక కార్యక్రమ నిర్వాహకులతో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
ఏయే రాష్ట్రాలు, దేశాల నుంచి ఎంతమంది కళాకారులు కరీంనగర్‌కు వచ్చి ప్రదర్శనలు ఇవ్వ బోతున్నారనే విషయంపై చర్చించారు. మూడు రోజుల్లో ఏయే రోజు ఎవరెవరు ప్రదర్శనలు ఇస్తారనే ప్రోగ్రాం షీట్‌కు తుది రూపం ఇచ్చారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ..దేశంలోని 20 రాష్ట్రాలతో పాటు మూడు దేశాల నుంచి 150కి పైగా కళాకారుల బృందాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శనలు ఇవ్వ నున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన జానపద కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వివరించారు. సినీనటులు ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలిపారు. కళోత్సవాల చివరిరోజైన అక్టోబర్ 2న సినీనటుడు చిరంజీవి హాజరవుతారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment