మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సెంట్రల్ జైలు స్థలం ఇదే..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు ఒడిలో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రాబోతోంది. పోరా టాల పురిటిగడ్డ ఇక మీదట ఆరోగ్య రాజధానిగా రూపుదిద్దుకోబోతోంది. అత్యంత ఆధునిక వైద్య సేవలతో ఏర్పాటు చేయనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. 24 అంతస్తులతో భారీ భవనాన్ని నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెలీ అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకునేలా 24వ అంతస్తుపై హెలీప్యాడ్ ఏర్పాటుతో పాటు ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
కాళేశ్వరం తర్వాత.. ఆ స్థాయిలో సాహసం
ఎంబీబీస్ కోర్సు చేస్తున్న విద్యార్థులు ఇటు ఎంజీఎంతో పాటు, అటు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో అతిపెద్ద ఆస్పత్రి నిర్మించనుండటంతో నగరం హెల్త్ హబ్‌గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉత్తర, దక్షిణ భారత్ మధ్య వారధి
ఈ చారిత్రక నిర్మాణం వెనుక చాలాపెద్ద కసరత్తే ఉంది. హైదరాబాద్ రద్దీగా మారిన నేపథ్యంలో.. ఉత్తర భారతదేశానికి – దక్షిణ భారత దేశానికి మధ్య వారధిగా ఉన్న వరంగల్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ సంకల్పంతోనే మే 21న సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించి సెంట్రల్ జైలును తరలించాలని ఆదేశించారు. మూడు రోజుల్లోనే జైలును నేలమట్టం చేసి ఎంజీఎం ఆస్పత్రికి స్థలాన్ని అప్పగించారు. రెండేళ్లలో ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. సోమవారం మరోసారి ముఖ్యమంత్రి వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రజలకు అంకితం చేయడంతో పాటు, ఆస్పత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.
దేశంలోనే అతి పెద్ద ఆస్పత్రి!
నిర్మాణం పూర్తి అయితే ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా కీర్తి సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా నిలుస్తోంది. చుట్టు పక్కల జిల్లాల వారే కాదు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే ఎంజీఎం భవనాలు పాత పడడం, అత్యాధునిక వసతులు దృష్టిలో ఉంచుకుని మరో భారీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం సంకల్పించారు.
నేడు, రేపు యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరి«శీలనతోపాటు తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో పర్యటించనున్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ప్రధానాలయంలో తాజాగా ఏర్పాటుచేసిన మేలిమివర్ణపు విద్యు ద్దీపాల అలంకరణ చిత్రీకరణను వీడియో ద్వారానే చూసిన ముఖ్యమంత్రి.. నేడు ప్రత్యక్షంగా చూడనున్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి దత్తత గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేసి, గ్రామసభ నిర్వహించనున్నారు. గ్రామా భివృద్ధితోపాటు మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం, ఉపాధి, మహిళా సం ఘాలు, యువతకు వ్యక్తిగత రుణాలు ఇలా గ్రామ సమగ్రాభివృద్ధిపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment