
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూశాఖ ప్రక్షళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (రేపటి) నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటోలాక్ చేస్తామన్నారు. ఆలయ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సభ్యులు చేసిన సూచనలకు, ప్రశ్నలకు సీఎం స్వయంగా సమాధానం చెప్పారు. (అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !)
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం రెవెన్యూ సంస్కరణలో తొలి అడుగు మాత్రమే అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పీటముడి పడి పరిష్కారం దొరకని అనేక సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామని తెలిపారు. పలు చట్టాల సమూహారంగా కొత్త రెవెన్యూ చట్టం కొనసాగుతుందని పేర్కొన్నారు. సమైఖ్య రాష్ట్రంలో 160కి పైగా చట్టాలు ఉండేవని, తెలంగాణలో ప్రస్తుతం 87 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నామని వెల్లడించారు. ధరణి ఒక్కటే కాదనీ, మిగిలిన చట్టాలు కూడా అందుబాటులో ఉంటాయని సభలో సీఎం వివరించారు. రెవెన్యూ కోర్టుల్లో 16వేల కేసులు, హైకోర్టులో 2వేల కేసులు ఉన్నాయని, సమగ్ర సర్వే చేస్తేనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకు 57 లక్షల 90 వేలమంది రైతులకు రైతుబంధు సాయం అందించామన్నారు. కేవలం 28 గంటల్లో రూ. 7,200 కోట్లు రైతులకు అందించగలిగామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. గ్రామాల్లో ఎవరి జీవితం వారే సాగిస్తున్నారు. గ్రామాల్లో వివాదంలో ఉన్న భూములు చాలా తక్కువ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment