హామీలు నెరవేర్చకపోతే.. ఓట్లు అడగను: కేసీఆర్‌ | KCR Speech at Palem Village, CM KCR Haliya Today Meeting | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చకపోతే.. ఓట్లు అడగను: కేసీఆర్‌

Published Wed, Feb 10 2021 5:47 PM | Last Updated on Wed, Feb 10 2021 7:48 PM

KCR Speech at Palem Village, CM KCR Haliya Today Meeting - Sakshi

సాక్షి, హాలియా: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్లగొండ జిల్లా హాలియాలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగా నిర్వహించింది. జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ త‌ర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ‘‘ఎదురెండలో కూడా ఇంత మంది నా సభకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత దూరం వచ్చినందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. నల్లగొండలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌లు అందరూ ఎంతో బాగా పని చేస్తున్నారు. చెట్లు పెంచుతున్నారు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను’’ అన్నారు కేసీఆర్‌.

‘‘కేవలం అభినందనలు మాత్రమే కాక జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు.. ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయలు.. ఒక్కో మున్సిపాలిటీకి కోటి రూపాయలు.. మిర్యాలగూడ మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాను. రేపే దీనిపై సంతకం చేస్తాను. సీఎం ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇస్తాను. అర్హులైన నిరుద్యోగులందరికి త్వరలోనే నిరుద్యోగ భ్రుతి, కొత్త పెన్షన్‌లు, కొత్త రేషన్‌ కార్డులు ఇస్తాం. నెల్లికళ్లు-జింకలపాలేం భూ వివాదాన్ని పరిష్కరిస్తాం. అర్హులందరికి పట్టాలు ఇస్తాం’’ అన్నారు.

రూ. 2,500 కోట్లతో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు
ఆయన మాట్లాడుతూ.. ‘‘నల్లగొండ వెనకబడిన జిల్లా. ఎందరు ముఖ్యమంత్రులు మారినా.. జిల్లాలో అభివృద్ధి జరగలేదు. జిల్లా సమస్యలన్ని నా దృష్టిలో ఉన్నాయి. వీటన్నింటిని పూర్తి చేసే బాధ్యత నాది. నెల్లికల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వచ్చాను. వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశాను. వీటన్నింటికి 2500 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. ఏడాదిన్నరలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాను. వేదిక మీద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల, గ్రామీణ ప్రాంత నాయకులంతా దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఏడాదిన్నరలోగా అన్ని సాగు నీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి. ఈ హామీలన్నింటిని పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను’’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

‘‘టీఆర్ఎస్‌‌ పార్టీ అంటే ధీరుల పార్టీ.. వెన్నుచూపే పార్టీ కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. నల్లగొండకు శాశ్వత ఆయకట్టు ఏర్పాటు చేసి.. సాగునీటికి సమస్య లేకుండా చూస్తాం. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను. డిండి ప్రాజెక్ట్‌ పూర్తయితే పాత నల్లగొండలోని 12 నియోజకర్గాలకు సాగు నీరుకు కరువుండదు’ అన్నారు. 

ఆరేళ్లలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టాం
‘‘నల్లగొండలో ఫ్లోరైడ్‌ భూతం ఒక జనరేషన్‌ని నాశనం చేసింది. ఇక్కడి ఉద్యమ కారులు ఫ్లోరైడ్‌ బాధితుడిని తీసుకెళ్లి అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ ముందు‌ పడుకోబెట్టినా సమస్య పరిష్కారం కాలేదు. కానీ టీఆర్‌ఎస్‌ ఆరేళ్లలో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టింది. అప్పటి చంద్రబాబు పంటలు వేసుకోమని చెప్పి.. మధ్యలో నీరు బందు పెట్టాడు. పంటలు ఎండిపోయాయి. అప్పుడు ఈ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. మేం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసి.. నీరు ఇప్పించాం’’ అన్నారు.

సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్‌ కడుపు మండుతుంది
‘‘దేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. మా ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా, 24 గంటలు కరెంట్‌ ఇస్తుంది. దీనికే కాంగ్రెస్‌ నాయకులు కడుపు మండుతుంది. విజయ డైరీని పునరుద్దరించాం. లీటరు పాలకు ఐదు రూపాయలు పెంచాం. మిషన్‌ కాకతీయ ద్వారా భూ గర్భ జలాలు పెరిగాయి. దేశంలో అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ. త్వరలోనే దేశంలో భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుంది’’ అన్నారు

‘‘తెలంగాణలో అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. కళ్యాణ లక్ష్మి, కంటి చూపు, కేసీఆర్‌ కిట్‌.. ఆడపిల్ల పుడితే రూ. 13,500, మగ పిల్లాడు పుడితే రూ.12,000 ఇస్తున్నాం. రెవెన్యూలో అవినీతి నిర్మూలనకు, లంచాల బాధ నుంచి విముక్తి చేయడం కోసం ధరణిని తీసుకువచ్చాం. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. గతంలో వీఆర్వోల చేతిలో పెట్టి గ్రామాలను రావణకాష్టం చేసిన వారు మీరు కాదా’’ అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

కుల వృత్తులను ఆదుకుంటాం
‘‘కుల వృత్తులను ఆదుకున్నాం. దానిలో భాగంగానే గొల్ల, కురమలకు గొర్రెలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 7,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మూడున్నర లక్షల మందికి గొర్రెలు ఇచ్చాం. ఈ మార్చిలో మరో రెండు లక్షల మందికి.. వచ్చే ఏడాది మరో రెండు లక్షల మందికి గొర్రెలు ఇస్తాం. అన్ని కుల వృత్తులను ఆదుకుంటాం. రాబోయే బడ్జెట్‌లో ప్రతి గ్రామంలో ఆధునిక సెలూన్ల కోసం నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయలు ఇస్తాం’’ అన్నారు. 

2,600 రైతు కేంద్రాలు నిర్మించాం
‘‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి క్లస్టర్‌లో మొత్తం 2,600 రైతు కేంద్రాలు నిర్మించి ఇచ్చాం. రైతులంతా అక్కడ కూర్చుని మాట్లాడుకుని అన్ని విషయాలు చర్చించుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు మీకు సేవ చేస్తారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ప్రజలు గుర్తించాలి. గతంలో సిద్ది పేటలో నాలుగు మొక్కలు పెడదాం అంటే దొరకలేదు. కానీ నేడు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, వాటర్‌ ట్యాంకర్‌లు అందజేశాం. ప్రతి గ్రామానికి స్మశాన వాటిక, వ్యర్థాల నిర్వహణ కొరకు ప్రత్యేక వార్డు నిర్మించాం’’ అన్నారు. 

విపక్షాలకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌
‘‘కాంగ్రెస్‌ పార్టీ అవాకులు, చెవాకులు పేలుతోంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ నాయకులు పిచ్చి వేషాలు వేస్తున్నారు. మిమ్మల్ని జనాలు నశం చేస్తారు.. వచ్చే ఎన్నికల్లో​ ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. పిచ్చి వాగుడుకు ఓ హద్దు ఉంటుంది. చాలా మంది రాకాసులతో కొట్లాడం.. మీ లాంటి గోకాసులు మాకు పెద్ద లెక్క కాదు. మాలో సహనం నశిస్తే.. మీకే ప్రమాదం. తొక్కి పారేస్తాం జాగ్రత్త’’ అని కేసీఆర్‌ ప్రతిపక్షాలను హెచ్చరించారు. 

‘‘హైదరాబాద్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ఆంధ్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో కలిపిన ఘనత కాంగ్రెస్‌దే. తెలంగాణలో కన్నీరు, కష్టాలకు నాటి కాంగ్రెస్‌ నాయకులే కారణం. మేం ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తే.. కమిషన్‌ల కోసం అంటారు. మిషన్‌ భగీరథను కమిషన్‌ భగీరథ అంటున్నారు. మీకు ప్రజలే సమాధానం చెప్తారు’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement