
సాక్షి, ఖమ్మం: దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు జాతీయ సంపదను కొల్లగొట్టి, పరిపాలనను అస్తవ్యస్తం చేస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. జాతీయ విధానానికి స్వస్తి పలికి ప్రైవేట్ శక్తులను పెంచి పోషిస్తున్నాయని.. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చిందని.. ఈ సభ జాతికి దిశానిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో విజయన్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయి. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతంగా ఉంది. కంటి వెలుగు పథకం చరిత్రలో నిలిచిపోతుంది. ఖమ్మంలో బీఆర్‌ఎస్ సభ నిర్వహించి సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త పోరాటానికి తెరలేపారు. ఆయనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. దేశ సమగ్రత, హక్కులను కాపాడుకోవా ల్సిన బాధ్యత అందరిపై ఉంది.
కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోంది. గవర్నర్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా.. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. చర్చలు జరగకుండానే చట్టసభల్లో బిల్లులను బలవంతంగా పాస్ చేస్తోంది. సంస్కరణల పేరుతో అనైతిక విధానాలను ఆచరిస్తోంది.
న్యాయవ్యవస్థలను నాశనం చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియంపై కూడా రాజకీయాలు చేస్తూ రాజ్యాంగ నిబంధనలను హరించివేస్తోంది. దేశ బడ్జెట్‌లో సామాన్యులకు కేటాయించడానికి నిధులు లేవంటూ.. కార్పొరేట్ శక్తులకు మాత్రం దోచిపెడుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి.
బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశాన్ని కులం, మతం పేరుతో నిలువునా చీలుస్తోంది. సామ్యవాద, ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ను విభజించేందుకు కుట్ర జరుగుతోంది. దేశ సంస్కృతిని నాశనం చేస్తూ గాంధీజీని హిందూత్వవాదిగా చూపిస్తూ దేశవ్యాప్తంగా హిందూత్వాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగుతోంది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పరిపాలన, ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రాల్లో పాలనను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్న బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలి..’’ అని పినరయి విజయన్ పిలుపునిచ్చారు. ప్రసంగిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్
Comments
Please login to add a commentAdd a comment