సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కసరత్తును బీజేపీ వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఉమ్మడి జిల్లాల్లోని అనేక శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూల వాతావరణం, పరిస్థితులున్న విషయం తాము జరిపిన పలు సర్వేలు, అధ్యయనాల్లో వెల్లడైనందున మరింత దూకుడుగా ముందుకెళ్లాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు.
ప్రధానంగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి, సామాజికవర్గాల వారీగా మద్దతు, ప్రభావితం చేసే అంశాలు, సంబంధిత నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే సామాజికవర్గాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు వచ్చి న ఓట్లు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు పడిన ఓట్లు, వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నుంచి పోటీచేసే సత్తా ఉన్న అభ్యర్థులు, వారి సామాజికవర్గాలు తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది.
జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, బలాబలాలు, ఏవైనా లోటుపాట్లు, ఇతర అంశాలుంటే వాటిని ఎలా సరిచేసుకోవాలనే విషయాలను పరిగణనలోకి తీసుకోవడంలో భాగంగా వివిధ జిల్లాల సమీక్షలను ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్ (రాష్ట్ర ఎన్నికల సహఇన్‌చార్జి కూడా), జాతీయ కార్యదర్శి అర్వి0ద్ మీనన్ పార్టీపరంగా వివిధ జిల్లాల సమీక్షలను నిర్వహించనున్నారు.
జిల్లాల నేతల నుంచి సమాచార సేకరణ
బుధవారం రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీ లతో తరుణ్‌చుగ్ సమీక్షలు ప్రారంభించారు. ఆయా అంశాలపై నాయకుల నుంచి వివరాలు, సమాచారం సేకరించినట్లు తెలిసింది. కేసీఆర్ సర్కార్‌పై వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవాలని రంగారెడ్డి అర్బన్, రూరల్ జిల్లా కమిటీలు, నాయకులను తరుణ్‌చుగ్ ఆదేశించినట్టు సమాచారం. గురువారం మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో చేపడుతున్న ఎన్నికల కార్యాచరణ, తయారీపై తరుణ్‌చుగ్ సమీక్షించనున్నారు.
ఇదిలా ఉంటే గురువా రం వరంగల్ క్లస్టర్‌లో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు) సునీల్ బన్సల్, నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో మీనన్ వేర్వేరుగా సమీక్షలు చేపడుతున్నారు. శుక్ర, శనివారాల్లో వివిధ అంశాలపై రాష్ట్రపార్టీ ముఖ్యనేతలతో విడతల వారీగా తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నాలుగు స్థానాల్లో కనీసం రెండింటిని గెలుపొందాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. ఇప్పటికే వీటిపరిధిలో విస్తృతంగా పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment