కేంద్రం, తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తా | Kishan Reddy Will Act As Coordinator At Cneter For Two Telugu States | Sakshi
Sakshi News home page

కేంద్రం, తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తా

Published Sat, Aug 21 2021 3:13 AM | Last Updated on Sat, Aug 21 2021 3:13 AM

Kishan Reddy Will Act As Coordinator At Cneter For Two Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రెండు తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా కేంద్రం వద్ద సమన్వయకర్తగా వ్యవహరిస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. పెండింగ్‌ పనుల పరిష్కారానికి, ప్రాజెక్టుల సాధనకు తన వంతు సహకారం అందిస్తా నని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానని చెప్పారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ప్రభుత్వ హోదాలో ప్రధాని మోదీ అప్పగించిన బాధ్యతలు, రాజకీయంగా సొంత రాష్ట్రం తెలంగాణలో పార్టీ ప్రాధాన్యతలు బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళతానన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోని పర్యాటక కేంద్రాలను పూర్తిగా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

‘దేఖో అప్నాదేశ్‌’అనే పథకం కింద వచ్చే ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు ఏడాది పాటు భారత్‌ దర్శన్‌ పేరిట దేశప్రజలు వివిధ ప్రాంతాలను పర్యటించేలా చేయాలన్నది తమ ఆలోచన అని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా అత్యధిక శాతం టీకా కార్యక్రమం ముగియనున్నందున, అంతర్జాతీయ పర్యాటకులను అనుమతించేందుకు కూడా చర్యలు చేపడతామన్నారు. కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాలో రాష్ట్రంలో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ను చేపట్టి తొలిసారిగా శనివారం హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ‘సాక్షి’కిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై కిషన్‌రెడ్డి మాట్లాడారు.  

 పర్యాటక, సాంస్కతిక రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? 
కిషన్‌రెడ్డి: కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగం దెబ్బతింది. కొన్ని లక్షల హోటళ్లు మూతపడ్డాయి. చాలామంది నిరుద్యోగులయ్యారు. దేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నా ఇంకా అన్ని పర్యాటక కేంద్రాలు తెరుచుకోలేదు. అక్కడక్కడ దేవాలయాలు తెరిచినా ఎక్కువసంఖ్యలో ప్రజలు రావడం లేదు. ప్రతి కుటుంబం ఏడాది కాలంలో దేశంలోని 15 పర్యాటక ప్రాంతాలు, ప్రాచీన కట్టడాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించాలన్న ప్రధాని మోదీ పిలుపునకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. 

ఏపీ, తెలంగాణల్లో టూరిజం  ప్రాజెక్ట్‌ల గురించి ఏమంటారు? 
కిషన్‌రెడ్డి: రెండు రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలపై దృష్టి పెడతాం. వాటిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఏపీలో 126 కేంద్రాలు, తెలంగాణలో 8 మాత్రమే పురావస్తు శాఖ పరిధిలోకి వస్తాయి. వీటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కార్యాచరణ చేపడతాం. త్వరలోనే మళ్లీ రామప్ప దేవాలయం సందర్శించి సౌకర్యాల మెరుగునకు చర్యలు తీసుకుంటాం. వచ్చే నెలలో దాని అభివృద్ధికి అవసరమైన పనులు చేపడతాం.  

కేంద్రమంత్రిగా ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? 
కిషన్‌రెడ్డి: గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రధాని మోదీకి ప్రీతిపాత్రమైన పర్యాటక, సాంస్కతిక శాఖల నిర్వహణతో పాటు ఏడు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి అక్కడి సీఎంలతో కలిసి పని చేయాల్సిన గురుతర బాధ్యత కూడా నాపై ఉంది. దేశవ్యాప్తంగా పర్యాటక, సాంస్కతిక కేంద్రాలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు వంటి వాటిని సమన్వయం చేయడమంటే కత్తిమీద స్వారీ చేయడంలాగే భావించాల్సి ఉంటుంది.  

 పార్టీ పరంగా ప్రణాళిక ఏమిటి? 
కిషన్‌రెడ్డి: ఏపీ, తెలంగాణలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారమయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement