బాలు నిర్వహించిన ఒక పాటల రియాలిటీ షోలో పాల్గొని మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. సంగీత ప్రపంచంలో స్థానం దక్కించుని, తన సంగీత దర్శకత్వంలో బాలు పాడే స్థాయికి ఎదగాలనుకున్నారు. తన కలను నెరవేర్చుకున్నారు. బాలుతో సుమారు 15 పాటలు పాడించుకున్నారు. బాలు నుంచి బోలెడన్ని ప్రశంసలు అందుకున్నారు. తన ఎదుగుదలకు పరోక్షంగా బాలు ప్రేరణ అయిన విధానం తలచుకుంటూ బాలు ప్రధమ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకులు కె. ఎం. రాధాకృష్ణ
బాలు పాటతో పెరిగాను..
నా ఐదవ ఏట నుంచే శాస్త్రీయం సంగీతం నేర్చుకున్నాను. మా నాన్నగారితో కలిసి లలిత సంగీతం పాడేవాడిని. అప్పట్లో ప్రతిరోజూ రేడియోలో సినిమా పాటలు వినేవాడిని. బాలుగారి పాటలు ట్రెండీగా, కమర్షియల్‌గా అనిపించేవి. అందరూ బాలు గారి గురించి మాట్లాడుకోవటం, బాలుగారిలా పాడాలి అనుకోవటం వింటూ పెరిగాను. అందరిలాగే నేను కూడా అలాగే అనుకున్నాను. బాలుగారికి సన్నిహితులైన కొందరి ద్వారా ఆయనను స్వయంగా చూసే అదృష్టం కలిగింది. 1998లో ఒక ప్రముఖ టీవీ చానల్‌లో పాటలకు సంబంధించి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశాను. మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అయిపోయాను. అలా మొదటి రౌండ్‌లోనే ఎలిమినేట్ అవ్వటం వల్ల నేను సంగీత దర్శకుడిగా మారాలనే కసి, పట్టుదల పెరిగాయి. సంగీత సాధన చేయటం ప్రారంభించాను. గాయకుడిగా కంటె, సంగీత దర్శకుడిగా స్థిరపడటం మంచిదని భావించి, దాని మీద దృష్టి పెట్టాను.
ఉప్పొంగెలే గోదావరి...
2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న పిల్లల కోసం తీసిన హీరో సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా తొలి అడుగు పెట్టాను. అప్పటికే నేను చేసిన ఆల్బమ్స్ నా స్నేహితులు.. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములకు వినిపించారు. ఆయనకు నచ్చటంతో ఆయన దర్శకత్వంలో రూపొందిన ఆనంద్ చిత్రానికి స్వరపరిచే అవకాశం వచ్చింది. అందులో బాలు గారి చేత పాడించుకోలేకపోయాననే వెలితి నాలో ఉండిపోయింది.
ఆ తరవాత ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ద్వారా ఆ వెలితి పోయింది. ఆయన ఆ పాట విని ఎంతో పరవశించారు. ఆయనతో పాడించుకోవటం వల్ల ఆ పాటకు ఎంతో అందం వచ్చింది. ఈ పాట బాలు గారు పాడితే ప్రపంచవ్యాప్తం అవుతుంది అనుకున్నాను. అదే జరిగింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘మాయాబజార్’ చిత్రంలో ‘సరోజ దళ నేత్రీ’ పాట వింటూనే బాలు గారు ‘ఈ పాట చాలా హాయిగా, అద్భుతంగా ఉంది. ఈ పాటను నేను మరింత అందం తీసుకురావటానికి ప్రయత్నిస్తాను’ అంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పాడారు. ఆ రాత్రి నాకు ఆనందంతో నిద్ర పట్టలేదు.
అప్పుడు అనుకున్నాను, ఆ రోజు పోటీలో ఓడిపోవటం మంచిదైందని. ఆనాటి నుంచి ఈ రోజు వరకు సంగీతం మీదే నిలబడ్డాను. ఉదయం తొమ్మిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కష్టపడటం అలవాటైంది. విపరీతమైన అలసట, తిండి కూడా సరిగ్గా తినే సమయం దొరకనంత బిజీగా ఉన్నాను. ‘గోదావరి’ చిత్రం వల్ల చిత్ర పరిశ్రమలో నాకు గౌరవం మరింత పెరిగింది. నిర్విరామంగా, నిరంతరం కష్టపడ్డాను, పడుతూనే ఉన్నాను.
ఆయనది బేస్ వాయిస్...
బాలుగారిది చాలా బేస్ వాయిస్. అందువల్ల ఏ పాటనైనా సులువుగా పాడేయగలుగుతారు. ఆయన నలభై ఏభై వేల పాటలు పాడటం పూర్తిగా దైవకృప. ఆయన ఒక నిరంతర సైనికుడిలా పాడుతూనే ఉన్నారు. ఆయనను చూసి.. ‘నేను కూడా బాలుగారిలాగ పాడాలి, హెలికాప్టర్‌లో తిరగాలి, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఇంటర్వ్యూలు ఇవ్వాలి’ అని కలలు కనేవాడిని. నా కలలు వాస్తవం అయ్యాయి. బాలు, శంకర్ మహదేవన్, హరిహరన్, శ్రేయోఘోషల్, ఆషాభోంశ్లే వంటి వారితో పాడించే స్థాయికి ఎదగటం నాకు చాలా ఆనందంగా ఉంటుంది.
ఎంతో చనువుగా అనేవారు...
నేను స్వరపరచిన కొన్ని పాటలు విని,‘నాతో ఎందుకు పాడించలేదు’ అని చనువుగా నన్ను కోప్పడేవారు. పాటలో ఉన్న జీవాన్ని తన గొంతులో పలికించేవారు. బాలు నిరంతర శ్రమజీవి. ఆయనకు భగవంతుడి నుంచి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఉంది. సహనంగా ఎన్నిటినో తట్టుకోవటం వల్లే ఈ స్థాయికి ఎదిగారు. బాలుకి ఎంతోమంది ప్రత్యామ్నాయంగా ఉన్నా, ఆయనది ‘యంగ్ వాయిస్’ కావటం వల్ల అందరూ ఆయననే కోరుకున్నారు. యువతరంలోకి కూడా పరకాయ ప్రవేశం చేసి, వాళ్ల గొంతులో దూరి ఈయన పాడటం వల్ల పాటలు బాగా హిట్ అయ్యాయి.
నేను ఒక పాట ట్రాక్ రికార్డు చేసి, బాలుగారికి పంపి, ‘సర్! నాకు యంగ్ వాయిస్‌లో కావాలి’ అన్నాను. ఆయన తన గొంతుని కంట్రోల్ చేస్తూ, యంగ్ హీరోలాగే పాడారు. డబ్బింగ్ అనుభవం, టైమింగ్ తెలిసి ఉండటం వల్ల ఆయన ఎవరికి పాడితే వారు పాడినట్లే అనిపించేది. అలా ఆయన తన గొంతును మార్చేవారు. మంద్ర స్థాయిలో పాడటం బాలు చేసిన మంచి పని. చాలామందికి నమ్మకాన్ని, స్ఫూర్తిని ఇచ్చారు. బాలుగారి నిరంతర శ్రమ వల్ల ఎంతోమంది పైకి వచ్చారు.
నమ్మకాన్ని పెంచింది...
నాకు శాస్త్రీయ సంగీతం రాదని చెబితే, బాలుగారు, ‘శాస్త్రీయంగా పాడుతున్నావు, సంగీతం రాదంటే ఎవరు నమ్ముతారు’ అన్నారు. ఆ తరవాత నుంచి శాస్త్రీయ సంగీతం బాగా సాధన చేశాను. ఆ సంగీత సాధనే నాకు మనోబలాన్ని ఇచ్చింది. నా పాటలు విన్న బాలుగారు, ‘కమర్షియల్‌గా చేయకపోయినా పరవాలేదు, శాస్త్రీయంగానే చేయాలిరా’ అన్నారు. చాలా వేదికల మీద నా పేరు ప్రస్తావించేవారు. ఏ షోలో ఎవరు నా పాట పాడినా, నన్ను బాగా ప్రశంసించేవారు. వెంటనే నాకు మెసేజ్ కూడా పంపేవారు. అదీ ఆయన సంస్కారం.
కె. ఎం. రాధాకృష్ణ, సంగీత దర్శకులు
సంపూర్ణ సుగుణాల కలబోత
1996లో ఒక రియాలిటీ షోలో పాల్గొన్న కార్యక్రమం ద్వారా బాలుగారితో 60 వారాల పాటు ప్రయాణం చేశాను. కేవలం బాలుగారిని చూడటానికే ఆ రియాలిటీ షోలో పాల్గొన్నాను. ఆ తరవాత నుంచి ఆ రియాలిటీ షోలో సెలక్షన్స్ ప్రక్రియను నాకే అప్పచెప్పారు. ఒక షోలో గెలుపొంది, ఆ షో సెలక్షన్స్‌తో పాటు, అదే కార్యక్రమానికి జడ్జిగా కూడా రావటం కేవలం బాలుగారి వల్లే జరిగింది. అలా ఆయనతో ప్రారంభమైన ప్రయాణం బాలుగారి తుది శ్వాస వరకు కొనసాగింది. ఆయన నన్ను ‘కొడుకు’ అనేవారు. నాకు ఆయన పితృ సమానులు. నన్ను బాలుగారే స్వయంగా ప్రముఖ దర్శకులు బాపు గారికి పరిచయం చేశారు. నన్ను మొట్టమొదటగా అమెరికాకు తీసుకు వెళ్లింది కూడా బాలు గారే.
2001లో నా స్టూడియోని బాలు గారే ప్రారంభించారు. నా స్టూడియోలోనే సుమారు నాలుగు వేల పాటలు పాడారు. అది నా అదృష్టం. ఆయన ప్రేమను పంచే మనిషి. చాలా ఆల్బమ్స్‌లో బాలుగారితో పాడించుకున్నాను. ఆయన రూపొందించిన ఒక కార్యక్రమంలో నేను సుమారు 80 పాటలు పాడాను. దేనికీ ఒక్క పైసా పుచ్చుకోలేదు. ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆయన నన్ను పొగిడారు.
అప్పుడు నేను ఆయనతో, ‘‘మీరు మాకు పాడే అవకాశం ఇస్తే అది మాకు అవకాశం దొరికినట్లు, అదే మేం మీతో పాడించుకుంటే అది మా అదృష్టం’’ అని చెప్పాను. కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘స్వరాభిషేకం’ చిత్రంలోని ‘కుడి కన్ను అదిరెనే’ పాటను నేనే స్వరపరిచాను. చిత్రంలో టైటిల్స్‌లో నా పేరు రాదు. కాని బాలు గారు ప్రపంచానికి ఈ విషయాన్ని పదేపదే చెప్పటం వల్లే నేను ఆ పాట చేశాననే విషయం అందరికీ తెలిసింది.
తండ్రిలా ఉండేవారు...
నాకు బాగా ఊబ కాయం రావటంతో, ఆయనే దగ్గరుండి నాకు బేరియాటిక్ సర్జరీ చేయించారు. ఆయనకు నా మీద ఉన్న పుత్రవాత్సల్యంతో చేసినందుకు నాకు ఆనందం అనిపించింది. చిన్న పిల్లలతో తూము నరసింహదాసు కీర్తనలు పాడించాను. అందులో ప్రతి ఎపిసోడ్‌కి ఆయన ముందు మాట చెప్పారు. నేను నిర్వహించిన ‘భాగవతం పద్యాలు’ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు. ఏ కార్యక్రమానికీ నా దగ్గర ఒక్క పైసా తీసుకోలేదు. అంతటి మహానుభావుడు. ప్రతి దశలోనూ అడుగడుగునా చెయ్యి పట్టుకుని నడిపించిన పెద్ద మనిషి. నేను ఆయనను వ్యక్తిగతంగా పోగొట్టుకున్నాను. ‘‘నేను పార్థు అడిగితే ఏదీ కాదనలేను’’ అనేవారు. ఆయనకు నేను చేసే కార్యక్రమాలంటే అంత ఇష్టం.
మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాలుగారు తుది శ్వాస విడిచాక, సెప్టెంబరు 25వ తేదీ చెన్నై వెళ్లాను. నేను గోపిక పూర్ణిమ.. ఇద్దరం కలిసి ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6.30 వరకు పాటలు పాడాం. ‘ఉరై రారా! నాతో గడుపు’ అన్నట్లుగా అనిపించింది. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు ఇచ్చారు. ఆయనకు నా పాటలు ఏవి నచ్చినా, కళ్లతో ఆనందం వ్యక్తం చేసేవారు. భుజం మీద చెయ్యి వేసి తట్టేవారు. సంపూర్ణమైన మానవత్వానికి ప్రతీక. ఆయనను అతి దగ్గరగా చూసినవారిలో నేనూ ఒకడిని. ఆయనతో నేను ‘‘మీ వ్యక్తిత్వం నేర్చుకుంటే వస్తుంది, కాని మీ విద్య, ప్రతిభ నేర్చుకుంటే వచ్చేది కాదు’’ అనేవాడిని.
అందరి గురించి అడిగేవారు..
ఆయన స్టూడియోకి వస్తూనే ఆఫీస్ బాయ్స్ క్షేమసమాచారాలు స్వయంగా అడిగి తెలుసుకునేవారు. ‘ఆయన గొప్ప కళాకారుడు’ అని చెప్పడానికి పార్థసారథి అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఉంటారు. మనిషిని గౌరవించటం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన గురించి ఎన్నని చెప్పగలను. ఎన్నో గుప్తదానాలు చేశారు. ఎవరో తెలిసినవారు ఆసుపత్రిలో ఉంటే, నా ద్వారా డబ్బు పంపారు.
‘మానవత్వం, మంచితనం, సమాజసేవ, కళాకారుడు, వ్యక్తిత్వం... ఇన్ని సుగుణాలు ఉన్న ఇంత గొప్ప వ్యక్తి ఇక మీదట రాడు. తన లోని లోపాలను గుర్తించి, తానే స్వయంగా సరిచేసుకునేవారు ఒక్కరు కూడా లేరు. గొప్ప సంగీత దర్శకుడైనా సరే, ఊరుపేరు లేని సంగీత దర్శకులైనా సరే ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పాడేవారు. అనుకున్న సమయానికి రికార్డింగుకి వస్తారు. ఏదైనా కారణం చేత ఆలస్యమైతే, క్షమాపణ అడుగుతారు. సంపూర్ణమైన సుగుణాల కలబోత బాలు.
- డా. పురాణపండ వైజయంతి
చదవండి: సోషల్ హల్‌చల్: క్యూట్ పప్పీతో చెర్రీ.. విలువైన పిక్ ఇదేనంటున్న ఉపాసన
Comments
Please login to add a commentAdd a comment