సాక్షి, మహబూబ్‌నగర్: అడవి కాకర (బోడ కాకర) ఏడాదిలో కొద్ది రోజులే వినిపించే ఓ రకమైన కాయగూర. మార్కెట్లో ఏ కూరగాయకు లేని ధర దీనికి ఉంటుంది. గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉండటంతో పాటు ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ గుణాలు ఉంటాయి. ఏటా వర్షాకాలం జూలై, ఆగష్టు రెండు నెలలు మాత్రమే పండుతుండటంతో దీనికి డిమాండ్ ఉంటుంది. బోడ కాకరను సామాన్యులు కొనలేని పరిస్థితి. ప్రస్తుతం కూరగాయల మార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది.
బోడ కాకరకాయ పూతకు వచ్చే వరకు ఏది కాయ కాస్తుందో, ఏది కాయదో తెలియదు. పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసివేసి ఆడ మొక్కలను మాత్రమే ఉంచాలి. ఆడ మొక్కలకే కాయ కాస్తుంది. బోడకాకరను విత్తనాలు, దుంపలు, తీగల కత్తిరింపు ద్వారా పెంచుతారు. తీగలైతే 2 లేక 3 నెలల వయస్సున్న వాటిని కత్తిరించి నాటుకోవచ్చు. దుంపలు అయితే 2 లేక 3 ఏళ్ల వయసున్నవి నాటుకోవచ్చు. విత్తనాలైతే గుంతకు 4, 5 విత్తుకోవాలి. విత్తనాల ద్వారా నాటిన మొక్కలు 50 నుంచి 60 రోజులకు పూతకు వస్తాయి. ఒక్కసారి నాటితే ప్రతి వర్షాకాలంలో 3 లేక 4 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది.
ఆరోగ్యానికి మంచింది..
అధిక ప్రొటీన్లు, ఐరన్, ఖనిజ లవణాలున్న పంటగా ప్రత్యేక స్థానం ఉంది. పీచు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. దీనిలోని ప్రొటీన్లు శరీరంలో రక్తకణాల వృద్ధి, గర్భస్థ శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయి. రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచడంతో చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తాయి. ఏ, సీ విటమిన్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకలను నాశనం చేయడానికి తోడ్పడుతుంది. దీని ఆకులతో తయారు చేసిన డికాషన్‌కు జ్వరాన్ని తగ్గించే గుణం ఉంటుంది. దీని వేర్లు తలనొప్పి, శరీరంలోని రాళ్లను, చెంపనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేగాకుండా మూలశంక, రక్తస్రావం, మూత్రకోశ వ్యాధులను అదుపులో ఉంచుతుంది. బోడకాకరకాయ గింజలను ఛాతి సంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
ఔషధ గుణాలెక్కువ..
అడవి కాకర తీగజాతికి సంబంధించినది. సీజన్‌లో మాత్రమే లభిస్తోంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్, బీపీ, డయాబెటిస్ తదితర వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇందులో ఆడ, మగజాతి రకాలుంటాయి. దీని విత్తనాన్ని కాపాడుకోవడానికి కాయలు కాసినప్పుడు ఆడజాతి కాకర కాయలను తెంపి వాటిని శుద్ది చేసుకోవాలి. వర్షాలకు రెండు నెలల ముందే భూమిలో నాటుకోవాలి. వర్షాలు కురిసితే జూన్‌లో మొలకెత్తి జూలై, ఆగష్టు వరకు కాయలు కాస్తాయి. మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది.
– ఖదీర్, ఉద్యాన అధికారి, మక్తల్
Comments
Please login to add a commentAdd a comment