సాక్షి, నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన వేలూరు గ్రామానికి చెందిన నర్సింహులు అనే దళిత రైతు పురుగుల మందు తాగి మరణించడం అత్యంత బాధాకరం అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అని ప్రశ్నించారు. నర్సింహులు మరణానికి బాద్యులైన అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని.. వారికి మూడు ఎకరాల భూమి ఇస్తానని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మోసం చేసింది. దళితులకు ఉన్న భూమిని అన్యాయంగా లాక్కొని ప్రభుత్వం వారి ఆత్మహత్యలకు కారణమవుతోంది. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేయగా దళిత యువకుడి పైన టిప్పర్ ఎక్కించి హత్య చేశారు’ అని కోమటిరెడ్డి ఆరోపించారు. (నా భూమి దక్కడం లేదు.. చనిపోతున్నా..! )
‘సిరిసిల్ల నియోజకవర్గంలో నెరేళ్లలో గతంలో ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బడుగు, బలహీన వర్గాల పైన ఈ ప్రభుత్వం థర్డ్ డిగ్రీని ప్రయోగించింది. కేసీఆర్ సర్కార్ దళితులను బలి తీసుకుంటుంది. వరుసగా దళితులపైన జరుగుతున్న దాడులు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. నర్సింహులు కుటుంబాన్ని కేసీఆర్ వెంటనే పరమార్శించాలి. రాష్ట్రంలో దళితుల పైన జరుగుతున్న ఘటనలకు సీఎం కేసీఆర్ వారికి క్షమాపణ చెప్పాలి. నర్సింహులు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సత్వరమే ఆదుకోవాలి. మూడు ఎకరాల భూమిని, 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలి. రాష్ట్రంలో ఉన్న దళితులు, బడుగు, బలహీన వర్గాలు ఎవరు అధైర్యపడవద్దు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment