కాచిగూడ (హైదరాబాద్): కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి లక్షకోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్ కేటాయించరా? అని ప్రశ్నించారు.
గతేడాది కేంద్రం బీసీలకు రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. బడ్జెట్‌లో బీసీలకు లక్షకోట్లు కేటాయించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోల జనార్దన్, మట్ట జయంతిగౌడ్, నీల వెంకటేశ్, మల్లేశ్‌యాదవ్, రాజేందర్, అంజి, బబ్లూ, శివ, చంటి, భాస్కర్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment