National BC Welfare Association
-
డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ జాతీయ బీసీ సంక్షేమ
కాచిగూడ (హైదరాబాద్): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 13, 14 తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం, అత్యధిక స్థానాల్లో బీసీ అభ్యర్థులకు పార్టీ టికెట్లు కేటాయించడంతోనే సరిపోదని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని కేంద్రప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వారా తేలిందని వెల్లడించారు. బీసీ బిల్లు కోసం బీసీలు సంఘటితంగా పోరాటం చేయాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలుంటే 22 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం ఏపీ అధ్యక్షుడు ఎన్.మారేశ్, బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బొల్ల మహేందర్, నీల వెంకటేశ్, వేముల రామకృష్ణ, జయంతి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్, సుధాకర్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెలు, బర్రెలు కాదు.. రాజ్యాధికారంలో వాటా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి... చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. బీఎస్పీ ఫ్లోర్ లీడర్ శ్యామ్ సింగ్, ఎంపీ బినోయ్ విశ్వమ్, సీపీఐ జాతీయ నాయకులు నారాయణ, మల్లు రవి మద్దతు తెలిపారు. వందలాది మంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీసీ సంఘాల నాయకులు ఈ భారీ ప్రదర్శనలో పాల్గొ న్నారు. ‘ఓట్లు బీసీలవి– సీట్లు అగ్రకు లాలవా.. రాజ్యాధికారంలో వాటా కావాలి‘ అంటూ నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నందగోపాల్ రాజ్ కుమార్, నేతలు గోవింద్, కర్రి వేణు మాధవ్, బాషయ్య, పరశురామ్ నాయకత్వం వహించారు. బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారు: కృష్ణయ్య ధర్నాను ఉద్దేశించి ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అ గ్రకులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆఘ మేఘాల మీద 10 శాతం రిజర్వేషన్లు పెట్టా రని... కానీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏళ్లుగా పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు – బర్రెలు పందులు – పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. -
బీసీలకు రూ.10వేల కోట్లు కేటాయించాలి: ఆర్. కృష్ణయ్య
కాచిగూడ (హైదరాబాద్): అసెంబ్లీలో ఈనెల 7న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన 14 బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఇప్పటికే పలుమార్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలసి బీసీల బడ్జెట్‌పై చర్చించామన్నారు. ఈ సారి బడ్జెట్ పెంచకపోతే వెనకబడిన వర్గాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అలాగే బీసీలకు సబ్‌ప్లాన్‌ను, బీసీబంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు. బడ్జెట్లో బీసీ కార్పొరేషన్‌కు సబ్సిడీ రుణాల కోసం రూ.3వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ అడ్వొకేట్లకు ఇచ్చే స్టైపెండ్‌ను రూ.10 వేలకు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్స్, మెస్ చార్జీలు పెంచాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్‌కు రూ.200 కోట్లు కేటాయిం చాలని, అర్హులందరికీ డీఎస్సీ, పోలీస్, గ్రూప్ పరీక్షలు, సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలన్నారు -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించాలి
కాచిగూడ (హైదరాబాద్): కేంద్రప్రభుత్వం వచ్చే బడ్జెట్లో బీసీల సంక్షేమం, అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో అఖిలపక్ష పార్టీల, బీసీ సంఘాల సమావేశం జరిగింది. సమావేశంలో వి.హనుమంతరావు (కాంగ్రెస్), అజీజ్‌పాషా (సీపీఐ), ఎస్.వీరయ్య (సీపీఎం), ఇందిరా శోభన్ (ఆమ్ఆద్మీ), ఎ.సుద ర్శన్ (శివసేన), రవీందర్ (ఎన్సీపీ), జ్యోతి (శివసేన), లాల్ కృష్ణ, కోల జనార్ధన్ (బీసీ సంక్షేమ సంఘం)లతో పాటు 56 కులసంఘాలు, 36 బీసీ సంఘాలు, 26 బీసీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వం బీసీల ఆర్థికాభి వృద్ధికి ఎలాంటి పథకాలు పెట్టడం లేదని, రాయితీ లు కల్పించడం లేదని, బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేయగా.. కేవలం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలు చేశారని, మిగతా ఆర్థికపరమైన ఒక్క స్కీమ్ కూడా అమలు చేయడానికి బడ్జెట్ కేటాయించడం లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమం లో నీల వెంకటేశ్, కోట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించండి
కాచిగూడ (హైదరాబాద్): కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో బీసీల అభివృద్ధి, సంక్షేమానికి లక్షకోట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాచిగూడలోని అభినందన్ గ్రాండ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీసం 5 శాతం బడ్జెట్ కేటాయించరా? అని ప్రశ్నించారు. గతేడాది కేంద్రం బీసీలకు రూ.1,050 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇది దేశంలో 70 కోట్ల మంది బీసీలకు పంచడానికి బిస్కెట్లు కూడా రావని ఎద్దేవాచేశారు. బడ్జెట్లో బీసీలకు లక్షకోట్లు కేటాయించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమానికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోల జనార్దన్, మట్ట జయంతిగౌడ్, నీల వెంకటేశ్, మల్లేశ్‌యాదవ్, రాజేందర్, అంజి, బబ్లూ, శివ, చంటి, భాస్కర్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు హామీనే తప్పు
♦ కాపులను బీసీలో చేరుస్తామన్న హామీ సాధ్యం కాదు ♦ 6 శాతమున్న కాపులు విధ్వంసం చేస్తే 54 శాతమున్న బీసీలు ఊరుకుంటారా: ఆర్ కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమను బీసీ జాబితాలో చేర్చాలని కాపులు ఉద్యమాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. కాపులను బీసీ జాబితాలో చేరిస్తే ఇతర అభివృద్ధి చెందిన కులాలు కూడా అదే డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని, దీనిపై రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ప్రత్యేక గ్రూపు ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇది సాధ్యం కాదని అన్నారు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకే ఏబీసీడీఈ గ్రూపులు ఉన్నాయని, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు, కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కేటగిరీకి గ్రూపుల విధానం లేదని చెప్పారు. చంద్రబాబు చేసిన ప్రకటనే తప్పు అని తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం నేతగా మాట్లాడటం లేదని, బీసీ నేతగానే మాట్లాడుతున్నానని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో ఏం చేసినా చట్టపరం జరగాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. 1969లో అనంతరామ్ కమిషన్, 1983లో మురళీధర్‌రావు కమిషన్, 1980లో కేంద్రంలోని మండల్ కమిషన్ కూడా కాపులను బీసీ జాబితాలో కలిపేందుకు ఒప్పుకోలేదని అన్నారు. కమిషన్ సిఫారసులు లేకుండా కులాలను బీసీ జాబితాలో కలిపితే కోర్టులు కూడా కొట్టివేస్తాయని, ఉత్తరప్రదేశ్‌లో జాట్లను ఓబీసీల్లో కలిపితే సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కూడా 1993లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జారీ చేసిన జీవోను బీసీ సంక్షేమ సంఘం కోర్టులో సవాల్ చేయడం వల్ల కొట్టేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 6 శాతం ఉన్న కాపులు విధ్వంసం సృష్టించడం ద్వారా లబ్ధిపొందాలని చూస్తే 54 శాతం ఉన్న బీసీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బీసీల ప్రతిఘటన ఉద్యమం రాకముందే కాపులు విజ్ఞతతో ఆలోచించాలని ఆర్. కృష్ణయ్య కోరారు.