చంద్రబాబు హామీనే తప్పు
♦ కాపులను బీసీలో చేరుస్తామన్న హామీ సాధ్యం కాదు
♦ 6 శాతమున్న కాపులు విధ్వంసం చేస్తే 54 శాతమున్న బీసీలు ఊరుకుంటారా: ఆర్ కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి శాస్త్రీయత, హేతుబద్ధత లేకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమను బీసీ జాబితాలో చేర్చాలని కాపులు ఉద్యమాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. కాపులను బీసీ జాబితాలో చేరిస్తే ఇతర అభివృద్ధి చెందిన కులాలు కూడా అదే డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉందని, దీనిపై రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ప్రత్యేక గ్రూపు ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇది సాధ్యం కాదని అన్నారు.
విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లకే ఏబీసీడీఈ గ్రూపులు ఉన్నాయని, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు, కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కేటగిరీకి గ్రూపుల విధానం లేదని చెప్పారు. చంద్రబాబు చేసిన ప్రకటనే తప్పు అని తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం నేతగా మాట్లాడటం లేదని, బీసీ నేతగానే మాట్లాడుతున్నానని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో ఏం చేసినా చట్టపరం జరగాలనే తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
1969లో అనంతరామ్ కమిషన్, 1983లో మురళీధర్‌రావు కమిషన్, 1980లో కేంద్రంలోని మండల్ కమిషన్ కూడా కాపులను బీసీ జాబితాలో కలిపేందుకు ఒప్పుకోలేదని అన్నారు. కమిషన్ సిఫారసులు లేకుండా కులాలను బీసీ జాబితాలో కలిపితే కోర్టులు కూడా కొట్టివేస్తాయని, ఉత్తరప్రదేశ్‌లో జాట్‌లను ఓబీసీల్లో కలిపితే సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కూడా 1993లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జారీ చేసిన జీవోను బీసీ సంక్షేమ సంఘం కోర్టులో సవాల్ చేయడం వల్ల కొట్టేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 6 శాతం ఉన్న కాపులు విధ్వంసం సృష్టించడం ద్వారా లబ్ధిపొందాలని చూస్తే 54 శాతం ఉన్న బీసీలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బీసీల ప్రతిఘటన ఉద్యమం రాకముందే కాపులు విజ్ఞతతో ఆలోచించాలని ఆర్. కృష్ణయ్య కోరారు.